ఆదిలాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : “కాంగ్రెస్ ఎన్నికల సమయంలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో హ్యాండిస్తున్నది. అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అంటూ బీసీ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. రిజర్వేషన్ల పేరిట తమను మోసగించిందని నిప్పులు చెరుగుతున్నారు. కులగణన నివేదిక తప్పులతడకగా రూపొందించారని, ఉద్దేశపూర్వకంగా బీసీ జనాభాను తగ్గించి చేసి చూపారని మండిపడుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీలు పదేళ్లలో పెరగాలి కానీ, తగ్గడం ఏమిటని నిలదీస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఎక్కడా చిత్త శుద్ధిని ప్రదర్శించడం లేదని, తప్పుడు లెక్కల నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టి, తీర్మానాన్ని కేంద్రానికి పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. బీసీ కులగణన నివేదిక తమ ఉనికికి ప్రమాదకరంగా మారిందని, వెంటనే దీనిని రద్దు చేసి రీ సర్వే చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.
బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి
తలమడుగు, ఫిబ్రవరి 7 : బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండు. తప్పుల తడకగా బీసీల సర్వే నిర్వహించి 46 శాతం బీసీలు ఉన్నారని లెక్కలు చూపెట్టిండు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన ఇంటింటి సర్వేలో 51 శాతం బీసీలు ఉన్నారని అప్పటి అధికారులు రిపోర్టు ఇచ్చిండ్రు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. అమలు చేయకుంటే ఎన్నికలను అడ్డుకుంటాం.
– మంగదుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకుడు, వడూర్, భీంపూర్
బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉండాలి
తలమడుగు, ఫిబ్రవరి 7 : ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ పీసీసీ హోదాలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేశారు. బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య చేతుల మీదుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల మీద గందరగోళం ఏర్పడింది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. మమ్మల్ని మోసం చేస్తే ఊరుకునేది లేదు. బీసీలకు అవమాన పరిస్తే బీసీ తడాఖా ఏమిటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తాం.
– వినోద్, బీసీ నాయకుడు, అర్లి(కే), తలమడుగు