ఆదిలాబాద్, నవంబరు 7 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం మరో చిచ్చు రేపింది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా, ఆదిలాబాద్ టికెట్ విషయంలో పార్టీ సీనియర్లు ఇప్పటికే పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక బోథ్ నియోజకవర్గ టికెట్‌ను వన్నెల అశోక్‌కు కేటాయించిన అధిష్ఠానం ఆయనను పక్కన పెట్టి ఆడే గజేందర్‌కు బీ ఫామ్‌ను అందజేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు ఆందోళనలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించిన తుడుందెబ్బ నాయకులు, జిల్లాలో నేడు(బుధవారం) ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల లొల్లి రోజు రోజుకూ ముదురుతున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గం టికెట్‌ను కంది శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చినందుకు డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్‌రెడ్డి రాజీనామా చేశారు.
బోథ్ కాం గ్రెస్ అభ్యర్థిగా రెండో జాబితాలో వన్నెల అశోక్ పేరును ప్రకటించగా సోమవారం ఆయనను కాదని ఆడే గజేందర్‌కు మార్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులు ఆందోళనబాట పట్టారు. ఆదిలాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.70 లక్షల జనాభా ఉన్న ఆదివాసులను కాంగ్రెస్ పార్టీ అవమానపర్చిందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్ మండిపట్టారు. ఆదివాసులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో రెండు ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు ఆదివాసులకు ఇస్తామని చెప్పారని, బోథ్ టికెట్ అభ్యర్థిగా ఆదివాసీ గిరిజనుడైన వన్నెల అశోక్‌కు ఇచ్చి ఎందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని గోడం గణేశ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఆదివాసులు ఏకమవుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలను దండుకొని టికెట్లు కేటాయించారని ఆరోపించారు. ఆయన కారణంగా కాం గ్రెస్ భారీ మూల్యం చేయించుకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఆదివాసీలతో పాటు అందరూ కాంగ్రెస్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నేడు ఆదిలాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్న రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళ సంఘం అధ్యక్షురాలు గోడం రేణుక, నాయకులు అశోక్, ఆత్రం గణపతి, ఆతం భారత్, ముకుంద్ పాల్గొన్నారు.