కాగజ్‌నగర్, ఆగస్టు 21: సిర్పూర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజల వెంటే ఉంటానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కో ఆర్డినేటర్ గోలం వెంకటేశ్, నాయకులు, పలువురు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు.
పార్టీలో చేరిన నాయకులు సిర్పూర్ నియోజకవర్గంలోని సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు అర్షద్ హుస్సేన్, మిన్హజ్, తదితరులు ఉన్నారు.