మంచిర్యాల, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కబ్జాకు కాదేదీ అనర్హం.. అన్నట్లుగా ఉంది జిల్లా కాంగ్రెస్ నేతల తీరు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు స్వాహా చేయడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే పలువురు లీడర్లు అనేక స్థలాలను చేజిక్కించుకున్నట్లు ఆరోపణలుండగా, తాజాగా సీతారాంపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత సింగిల్ విండో డైరెక్టర్ ఓ వేద బ్రాహ్మణుడికి చెందిన 38 గుంటలపై కన్నేసి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ స్వాధీనం చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. పైగా సదరు నేత ఎంతోకొంత తీసుకొని కాంప్రమైజ్ కావాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పట్టాదారు, అయ్యగారైన శీనయ్య కుటుంబ సభ్యులు ఆరోపించడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల్ పహాడ్ పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లెలోని రామాలయంలో సౌమిత్రి శ్రీనివాస చార్యులు(అయ్యగారు శీనయ్య) అర్చకులుగా పని చేసేవారు. జీవీ వెంక ట మనోహర్‌రావు అనే భూస్వామి ఆలయంలో పూజ లు చేస్తున్నందుకుగాను శీనయ్యకు సర్వే నంబర్ 6/1 లో 38 గుంటల భూమిని 38ఈ పట్టా కింద ఇచ్చారు. 1951 కాస్తా పహణీ నుంచి రెవెన్యూ రికార్డుల్లో శీన య్య ఉంటూ వచ్చారు. 1985లో ఆయన మరణాంతరం ఆయన కుమారులు ముగ్గురిలో పెద్దవాడైన ఎం బల చారి మంచిర్యాలకు, మరొకరు గోదావరిఖనికి, ఇంకొకరు వరంగల్‌కు వెళ్లి స్థిరపడ్డారు.
ఈ క్రమంలో 1951 నుంచి 2006 వరకు శీనయ్య పేరు మీద రెవె న్యూ రికార్డుల్లో ఈ 38 గుంటల భూమి ఉంటూ వ చ్చింది. 2006లో వారసులతో పని లేకుండానే ఆ భూ మిని సింగిల్ విండో డైరెక్టర్‌గా ఉన్న సదరు కాంగ్రెస్ నాయకుడి అన్న పేరుపైకి మారింది. ఇక్కడే కబ్జాకు అంకురార్పణ జరిగింది. ఇలా రెవెన్యూ రికార్డుల్లో పే రు ఎక్కించుకున్న రెండేళ్లకు శీనయ్య పెద్ద కుమారుడు ఎంబలచారి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సద రు నాయకుడు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారని బాధి త కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేరుపైకి భూమి రాకుండా, నేరుగా సదరు నాయకుడి అన్న పేరుపైకి ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు.
శీనయ్యకు ముగ్గురు కుమారులుంటే ఎంబలచారి ఏకైక వారసుడిగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఎంబలచారి ఫొటో పెట్టి ఆయన సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ మొదటిపేజీలో ఒకలా, చివరి పేజీలో ఒకలా ఎంబలచారి సంతకం ఉందని.. ఆ డాక్యుమెంట్ చూస్తేనే ఇది తప్పుడు డాక్యుమెంట్ అని అర్థమవుతుందన్నారు. తాము ఎవ్వరికీ విక్రయించకుండా మా నాన్న శీనయ్య పేరుపై ఉన్న భూమిని మా అన్న ఎంబలచారి విక్రయించినట్లు తప్పుడు రిజిస్ట్రేసన్ చేయించారని ఎంబలచారి సోదరుడు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు.
వేద బ్రాహ్మణుల కుటుంబ భూమి కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సదరు కాంగ్రెస్ నాయకుడు ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయన ఏకైక కుమారుడు ఎంబలచారితో పాటు ఆయన భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారని మీడియా ముందు చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వీరెవ్వరి సంతకాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. బాధిత కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి, అధికారులను కలిసి తాము భూమి విక్రయించలేదని చెబుతున్నారు.
తాము మీడియా ముందుకు రావడంతో సదరు నాయకుడితో పాటు ఆయన తండ్రి, కొందరు బ్రాహ్మణులను మా ఇండ్ల మీదకు తీసుకువచ్చి, ఎలాగైనా భూమిని తమకే అప్పగించాలని, ఎంతో కొంత తీసుకొని సెటిల్ చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పేద బ్రాహ్మణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలు సైతం ఇచ్చామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సి ఉంది.
మా నాన్న ఎంబలచారి, మా అమ్మ, అన్నయ్య సంతకాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు, సీతారాంపల్లి సింగిల్ విండో చైర్మన్ ధర్ని మధు చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎవ్వరి సంతకాలు లేవు. మా నుంచి కొనుగోలు చేశామన్నారు. మళ్లీ మధ్యవర్తులను తీసుకొని ఇంటికి ఎందుకు వస్తున్నారు. సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. మా కుటుంబం మొత్తం సంతకాలు పెట్టి విక్రయించి ఉంటే ఎందుకు ఒత్తిడి తీసుకువస్తున్నారు. మా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది. ధర్ని మధు చెప్పినట్లు మా నాన్న సంతకాలు పెట్టలేదు. మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ సంతకాలు చేయలేదు. దొంగ సంతకాలు పెట్టుకున్నారు. మాకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాం. ప్రజలు, కలెక్టర్, సీపీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– వెంకట నర్సింహాచారి (పట్టాదారు మనవడు)
మా నాన్న, సీతారాంపల్లి రామాలయ పూజారీకి ముగ్గురు కొడుకులం. మా అన్నయ్యలు ఎంబలచారి, లక్ష్మీనరసింహచారి అనంతరం నేను ఉన్నా. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మా అన్నయ్యను ఏకైక వారసుడిగా చూపించారు. ఇది ఎలా ధ్రువీకరించారు, ఎవరు ధ్రువీకరించారు. మేము అమ్మకుండా ధర్ని మధు దొంగపట్టా చేయించుకున్నారు. ఆ డాక్యుమెంట్లో ఉన్నవి మా అన్నయ్య నిజమైన సంతకాలు కాదు. ఫోర్జరీ చేసి తప్పుడు పట్టా చేసుకున్నారు.
– సత్యనారాయణ, (పట్టాదారు కుమారుడు)
మా ఇంటికి ధర్ని మధు, వాళ్ల నాన్న వెంకటేశం, ఓ నలుగురు బ్రాహ్మణులను తీసుకువచ్చి ఎంతో కొంత డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి భూముల దగ్గర తలలు పగిలిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. వారి నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. కాంప్రమైజ్ అయితే ఎంతో కొంత ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. అవన్నీ మాకు అవసరం లేదు. మేము పేద బ్రాహ్మణులం. మా భూమి మాకు ఇప్పించండి. ఇంకేం వద్దు. అధికారులను సైతం ఇదే వేడుకుంటున్నాం.
– శోభారాణి (పట్టాదారు మనవరాలు)