మంచిర్యాల, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ అధికారిక, ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ పదవీకాలం ముగిశాక కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పాల్గొనడం, లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయడం చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లే రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎలాంటి ప్రొటోకాల్ పదవుల్లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు బానేశ్, పూదరి ప్రభాకర్ తదితరులు రేషన్ కార్డులు పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది.
ఇలా జరగకుండా చూడాల్సిన అధికారులే మిన్నకుండిపోవడం, కాంగ్రెస్ లీడర్లు ఈ కార్యక్రమంలో ప్రసంగించడం పెద్ద దుమారం లేపింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా మంచిర్యాల తహసీల్దార్ సైతం వారితో పాటు రేషన్‌కార్డులు పంపిణీ చేయడం, ప్రేక్షకపాత్ర పోషించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సన్నబియ్యం పంపిణీ చేసిన సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులే లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేశారు. ఆ సమయంలో ఎవ్వరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రతిపక్ష పార్టీ నాయకులు, స్థానికులు మండిపడుతున్నారు.