మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ బెల్లంపల్లి, సెప్టెంబర్ 30 : బెల్లంపల్లి నియోజకవర్గంలో ‘హస్తం’ పార్టీకి గడ్డుకాలం మొదలైందా .. అంటే.. ఆయా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తమకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ సొంత పార్టీ ముఖ్య నాయకులే సమావేశం నిర్వహించి మరీ అసంతృప్తి వెళ్లగక్కడం.. ఇలాగైతే పార్టీలో ఉండలేమంటూ కుండబద్దలు కొట్టడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. అంతర్గత కుమ్ములాటలతో పాటు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత బట్టబయలు కావడం సంచలనంగా మారింది. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ వెన్నంటే ఉండి, కొన్నేండ్లుగా పార్టీనే నమ్ముకొని, కేసులు ఎదుర్కొన్న తమను పక్కకు పెట్టడం ఎంత వరకు సమంజసమంటూ నాయకవర్గం ఆగ్రహంతో ఊగిపోతున్నది. ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా ఉండకపోవడం.. ఏమైనా చెప్పుకోవాలంటూ హైదరాబాద్ దాకా వెళ్లాల్సి వస్తుండడంతో స్థానిక లీడర్లకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎమ్మెల్యే సుముఖత చూపకపోవడం.. సీనియర్లను కాదని, ఇటీవల పార్టీలోకి వచ్చిన నాయకులను ఎమ్మెల్యే దగ్గరకు తీస్తుండడంతో సీనియర్ లీడర్లు కుతకుతలాడిపోతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే వినోద్ పద్ధతి మార్చుకొని పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదంటూ మొన్నటి సమావేశంలో నాయకులు ఎమ్మెల్యేను హెచ్చరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినోద్ స్థానికంగా ఉంటానని, ఇక్కడే ఇల్లు నిర్మించుకొని నివాసం ఏర్పర్చుకుంటానని బెల్లంపల్లి సుభాష్‌నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసి మరీ బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ క్రమంలో చుట్టపు చూపు ఎమ్మెల్యేగా మారడం నియోజకవర్గ ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అసంతృప్తిలో ఉన్నారు. స్థానికంగా ఉండడం లేదనే ఆగ్రహంతో సీనియర్ నాయకులు కూడా ముఖ్య సమావేశం నిర్వహించి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. స్థానికంగా లేకపోవడంతో పార్టీ పరంగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కేవలం అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తప్ప, అడపాదడపా వస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బెల్లంపల్లి పట్టణంతో పాటు ఏడు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి కాలు కదపలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన హుటాహుటినా నీట మునిగినా బెల్లంపల్లి రాంనగర్ బ్రిడ్జిని మాత్రమే నామమాత్రంగా పరిశీలించి వెళ్లిపోయారు. అంతే తప్ప నియోజకవర్గంలో వరద ప్రాంతాల పరిశీలన, బాధితుల పరామర్శ చేయలేదని ఆగ్రహంతో ఉన్నారు. నాలుగు రోజుల కితం ఎమ్మెల్యే స్థానికంగా ఉండడం లేదని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అన్ని పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ,ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో యుద్ధప్రాతిపదికన పాల్గొన్నారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తోంది. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశ చెందుతున్నారు. తీరా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినా చుట్టూ నాయకులు ఉండడంతో ప్రజలు ఎమ్మెల్యేను కలిసే పరిస్థితి ఉండడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. స్థానికంగా ఉండి తమ సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ పరిష్కరిస్తారని నమ్మి గెలిపిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి నెల ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రకటించినా ఎమ్మెల్యే ఒక్కసారి మాత్రమే ప్రజాదర్బార్ చేపట్టి ఆ మాటే మరిచిపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసీ తీసుకోవాలంటే ఎమ్మెల్యే అనుమతి, సంతకం తప్పనిసరికావడంతో నియోజకవర్గ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్వోసీతో పాటు ఇతర సమస్యల కోసం ఎమ్మెల్యేను కలవడం కోసం మరింతగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉంటే తమకు ఇబ్బందులు ఉండవని ప్రజలు గట్టిగా చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో నియోజవర్గంలోని మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల అధికార పార్టీల నాయకులకు వరంలా మారింది. తామే ఎమ్మెల్యేమంటూ వారు చెబుతూ అందినంత దండుకుంటూ పనులు చేయిస్తున్నారు. ఎల్వోసీ నుంచి సీఎంఆర్ఎఫ్, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలలో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరి కొంత మంది నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్ డిపో, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్, ఇండస్రీయల్స్ ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా ఎమ్మెల్యే ఆ దిశగా కార్యాచరణ రూపొందించకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. అభివృద్ధి మాట అటు ఉంచితే కనీసం ఆయన మొహం కూడా మరిచిపోతున్నామని ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రజల్లోకి రావాలని, ఆయన స్థానికంగా అందుబాటులో లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలకు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారుతుందా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.