దండేపల్లి, జూన్22 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులు, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజత్రావు విమర్శించారు. దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు.. అధికారంలోకి వచ్చాక మాట్లాడే మాటలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. వడ్లు, మక్క కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన రైతులను రాజులను చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వెన్ను పోటు పొడిచిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు దక్కిందన్నారు. దివాకర్‌రావు చేసిన అభివృద్ధి పనులు ప్రస్తుత ఎమ్మెల్యే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకూ కటింగ్ చేసి, రైతుల శ్రమను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల్లోనూ కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, బిల్లుల మంజూరుకు రూ. 50 వేల వరకూ వసూలు చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా ఎగరనున్నదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు భయబ్రాంతులకు గురిచేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు వచ్చే పంట సీజన్లో యూరియా, నీళ్లు, కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.