కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కెరమెరి, జూన్ 4 : వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంటలు వేసే సమయం సమీపిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. పంట రుణాలు తీసుకుందామనుకున్నా.. పాత అప్పు తీరుస్తేగాని బ్యాంకోళ్లు కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్దెరకోసం వ్యాపారులను ఆశ్రయిస్తుండ గా, వారు చెప్పిన ధరకే.. ఇచ్చిన విత్తనాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
పెట్టుబడి కోసం నరకం..
జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా పత్తి 3.35 లక్షల ఎకరాల్లో సాగువుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక, బ్యాంకుల నుంచి రుణాలు పొందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది విత్తన వ్యాపారుల వద్దనే విత్తనాలు, ఎరువులను ఉద్దెర తీసుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో జిల్లాలోని సుమారు 1.31 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 210 కోట్ల సాయం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పెట్టుబడికి నరకం చూస్తున్నారు.
చెప్పిన ధరకే విత్తనాలు..
విత్తనాల వ్యాపారులు చెప్పిన ధరకు, ఇచ్చిన విత్తనాలే రైతులు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రైతులకు మంచి దిగుబడి ఇచ్చే బ్రాండెడ్ కంపెనీల విత్తనాలను వ్యాపారులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. విత్తనాలను ఉద్దెరకు తీసుకుంటుండడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా అంట గడుతున్నారు. పది ప్యాకెట్ల విత్తనాలు అడిగితే ఒక ప్యాకెట్ బ్రాండెడ్, మిగతా తొమ్మిది ప్యాకెట్లు ఇతర కంపెనీలవి అంటగడుతున్నారు. ఉద్దెరకు తీసుకుంటుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వ్యాపారులు ఇచ్చినవే తీసుకుంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడం, రుణాలు ప్రారంభం కాకపోవడంతో వ్యాపారులు ఇచ్చిన విత్తనాలనే తీసుకోవాల్సిన వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దెరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది
విత్తనాలు కొనాలంటే డబ్బులు లేవు. వానకాలం పంట పెట్టుబడికి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విత్తనాలు ఉద్దెరకు తీసుకోవాల్సి వచ్చింది. వారు ఏ విత్తనాలు ఇచ్చినా తప్పలేదు. సర్కారు రైతు భరోసా ఇస్తే నాకు కావాల్సిన విత్తనాలు కొనుక్కునే వాడిని.
– నైతం యశ్వంత్, రైతు, హట్టి, కెరమెరి
కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుబడికి ఇబ్బంది లేకుండే..
బ్యాంకు వాళ్లు రుణాలు ఇవ్వడం మొదలు పెట్టలేదు. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు. చేసేదేమిలేక ఉద్దెరతో విత్తనాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. షాపు వాళ్లు ఏ విత్తనాలు ఇస్తే వాటినే తీసుకోవాల్సి వస్తుంది. వాళ్లు చెప్పిన ధరకే కొనాలి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాకు రంది లేకుండే. విత్తనాలు పెట్టే సమయానికి రైతుబంధు అందేది.
– ఆత్రం అమృత్రావు, రైతు, మోడి, కెరమెరి.