ఆదిలాబాద్, మే 5(నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ రక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపుల, అడవులు, ఇంటి పరిసరాలు, చెరువులు, పొలాల గట్లపై మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం బాధ్యతను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పచెప్పడంతో వారు ప్రత్యేక దృష్టి సారించి మొక్కలను కాపాడారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు హరితనిధితోపాటు పచ్చదనం పెంపొందించడానికి పది శాతం నిధులను మంజూరు చేసింది. ఏటా వానకాలం సీజన్‌కు ముందుగానే నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి అవసరమైన మొక్కులను సరఫరా చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరితహారం కార్యక్రమంలో తీసుకున్న పకడ్బందీ చర్యల ఫలితంగా పచ్చదనం పెరిగింది.
హరితహారం కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో జిల్లా వ్యాప్తంగా 1.65 కోట్ల మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం కార్యక్రమం పేరును వనమహోత్సవంగా మార్చింది. పెద్ద పంచాయతీల్లో 10 వేల మొక్కలు, చిన్న పంచాయతీల్లో 7 వేల మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టారు. గతేడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 24.05 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఈ ఏడాది 34.03 మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు నాటుతున్న అధికారులు వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎండిపోతున్నాయి. మొక్కలకు రక్షణ కల్పించకపోవడం, నీరు పోయకపోవడంతో మొక్కలు పెరగడం లేదు. పంచాయతీలకు నిధుల కొరత కారణంగా నీరు అందించలేని పరిస్థితి నెలకున్నది. గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్ల చాలా పంచాయతీల్లో మూలన పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంతో కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.