నిర్మల్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ) : రైతుల సంక్షేమంతోపాటు వారి భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు పీఏసీఎస్‌లు కేవలం ఆ సంఘాల పరిధిలోని రైతులతో కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సంఘాల పాలకవర్గాలను ప్రజాస్వామ్య పద్ధతిలో సభ్యత్వం ఉన్న రైతులు కలిసి ఎన్నుకొనేవారు. పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్ల పాటు ఉండేది. కాలపరిమితి ముగిసిన అనంతరం సహకార శాఖ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసేది. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా ఎన్నికలు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా, రెండుసార్లు పాత పాలకవర్గాల గడువును పొడిగించింది.
గత డిసెంబర్లో సొసైటీల పాలకవర్గాలు పూర్తిగా రద్దు చేసి, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు కట్టబెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నామినేటెడ్ విధానానికే మొగ్గు చూపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ విధానం ద్వారా సొసైటీల్లో రైతుల భాగస్వామ్యం తగ్గుతుందన్న అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పద్ధతిలో కేవలం అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సూచించిన వారికే చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు దక్కే అవకాశం ఉంది.
నిర్మల్ జిల్లాలో 17 పీఏసీఎస్‌లు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో సొసైటీ పరిధిలో ఉన్న రైతుల సంఖ్యను బట్టి.. గ్రామాలవారీగా 13 భాగాలుగా విభజించి టీసీ(టెరెటోరియల్ కాన్సెన్సీ)లకు ఎన్నికలు నిర్వహిస్తారు. అలా ఎన్నికైన టీసీ మెంబర్లలో ఒకరిని మిగతా సభ్యులు కలిసి చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు కొనసాగిన ఈ పద్ధతి ద్వారా గ్రామాల్లోని పీఏసీఎస్‌ల్లో రైతులే చైన్‌మన్‌తోపాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా కొనసాగేవారు. ఈ సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లంతా స్వయంగా రైతులే కావడంతో వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు పకడ్బందీగా పర్యవేక్షించేవారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనా లు, వ్యవసాయ రుణాల పంపిణీతోపాటు, సబ్సిడీపై రైతులకు యంత్ర పరికారాలు అం దజేస్తుంటారు. ప్రతి సీజన్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు సొసైటీలే ని ర్వర్తిస్తున్నాయి.
వ్యవసాయ రుణాల ప్రక్రియను కూడా సహకార సంఘాలే పర్యవేక్షిస్తుండడంతో వీటికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గత కొన్నేళ్ల నుంచి ప్రస్తుతం ఉన్న సహకార వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం సంఘాల అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే దిశగా అడుగులు వేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇక నుంచి సంఘాల పాలకవర్గాలను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతితో కాకుండా రైతుల భాగస్వామ్యం లేకుండానే నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయనుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం తీసుకోబోతున్న తాజా నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా సంఘాల పరిధిలో సభ్యులుగా ఉన్న రైతులు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించేందు కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కొనసాగిన పాలకవార్గాల ఎన్నిక పద్ధతిలోనే రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సాధారణ ప్రజలే కాకుండా రైతులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. హామీలు నెరవేర్చకపోవడం, నిధుల కొరత పేరిట అభివృద్ధి నిలిచిపోవడం, రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడం, సకాలంలో రైతు భరోసా అందజేయకపోవడం, కొత్త రుణాల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతుల్లో పెరిగిపోయిన ఆగ్రహం, అసంతృప్తిని పసిగట్టిన ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల లక్ష్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే పరాభవం తప్పదనే నిర్ధారణకు వచ్చింది. దీంతో నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేసేందుకు ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
నామినేటెడ్ పద్ధతిలో పదవులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కట్టబెడితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి సొసైటీ పదవుల్లో ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. అలాగే సొసైటీ గురించి కనీస అవగాహన ఉండాలి. నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తే సొసైటీల్లో రైతుల భాగస్వామ్యం లేకుండా పోతుంది. కేవలం రాజకీయ ఎంప్లాయ్మెంట్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి ఈ పద్ధతిని తెస్తున్నరు. పదవుల కోసం అవగాహన లేని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సొసైటీలను అప్పగిస్తే రైతులకు తీవ్రనష్టం జరుగుతుంది. కేసీఆర్ పదేళ్లపాలనలో సొసైటీలు బలోపేతం అయినయ్. ప్రతి సీజన్‌కు ముందే పక్కా ప్రణాళికలతో రైతులు పండించిన మక్క లు, వడ్ల కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించి సొసైటీలను లాభాల బాట పట్టించినం. అలాంటి సొసైటీల్లో రైతుల ప్రమేయం లేకుండా అవగాహన లేని అనామకులకు పదవులు కట్టబెడితే రైతులకు అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడి విధానాన్ని ఇక్కడ రుద్దుతామంటే కుదరదు. ఈ నామినేటెడ్ విధాన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు దిగుతం.