నిర్మల్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహపు లెక్కలు పక్కాగా ఉండడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్లలోకి వస్తున్న వరద నీటిపై స్పష్టత లేని కారణంగా అధికారులు ప్రవాహ తీవ్రతతోనే లెక్కలు కట్టాల్సి వస్తున్నది. సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) ఒక రకం, స్థానిక ఇరిగేషన్ శాఖ మరోరకంగా లెక్కలు చెబుతుండడంతో గందరగోళం నెలకున్నది. కడెం మినహా స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టుల పరిస్థితి అధికారులకు తలనొప్పిగా మారుతున్నది. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి గత వానకాలంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటి ప్రవాహ లెక్కలపై స్పష్టత లేకపోవడంతో దిగువకు నీటి విడుదల విషయంలో అయోమయం నెలకున్నది. భారీ వర్షాల సమయంలో ఇంజినీర్లు ప్రాజెక్టుల వద్దనే ఉండి వరద ఉధృతిని అంచనా వేసి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈ ప్రాజెక్టుల ఎగువ భాగాన రేయిన్ గేజ్ స్టేషన్లు, సెన్సార్లు లేకపోవడంతో వరద ప్రవాహాన్ని కచ్చితత్వంతో లెక్కించలేకపోతున్నారు.
కడెంకు రేయిన్గేజ్ స్టేషన్, సెన్సార్లు పూర్తి
నిన్న, మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు ఎగువ భాగంలో కూడా వరద ప్రవాహాన్ని లెక్కించేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో రెండు, మూడేళ్లుగా వస్తున్న ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన వరద కారణంగా ప్రాజెక్టుకే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. కడెం ప్రాజెక్టు ఎగువ భాగాన కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన పసుపుల వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు ప్రాజెక్టు ఎగువన గల గ్రామాలతోపాటు దిగువన తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదలకు సంబంధించి ఆరు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించగా, సెంట్రల్ వాటర్ కమిషన్ 4.94 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిందని చెప్పింది. నీటి ప్రవాహాన్ని లెక్కించే వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే ఇలాంటి భిన్నమైన ప్రకటనలు చేసే పరిస్థితి ఏర్పడుతున్నది. దీనిని నివారించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులతోపాటు రేయిన్గేజ్ స్టేషన్లు, అత్యాధునిక సెన్సార్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. అప్పటి నిధులతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టారు. అలాగే రేయిన్గేజ్ స్టేషన్, సెన్సార్ల ఏర్పాటు వంటి పనులు ఇటీవలే పూర్తయ్యాయి.
పేరుకుపోయిన పూడిక
మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికకు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టులోని గరిష్ట, కనిష్ట నీటి మట్టాల మధ్య భారీ తేడా వస్తున్నదని చెబుతున్నారు. పూడిక కారణంగా నీటి మట్టాల లెక్కలు సక్రమంగా తెలియక కాలువలకు నీటి విడుదల విషయంలో కూడా సమతుల్యత లోపిస్తున్నదన్న వాదనలు ఉన్నాయి. ఎగువ నుంచి వచ్చే వరదను లెక్కలోకి తీసుకోకుండానే రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో తరచూ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. గతంలో నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ కూడా నీట మునిగిన సంగతి తెలిసిందే. స్వర్ణ ప్రాజెక్టుకు వరద పోటు తీవ్రమవడంతో ప్రవాహ ఉధృతి తెలియక ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం పెరగడంతో ఒకేసారి గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో వచ్చిన వరదల కారణంగా దాదాపు రూ.5 కోట్ల విద్యుత్ స్తంభాలు, టవర్లు, ట్రాన్స్ఫార్మర్లు నేలమట్టమయ్యాయి.
గేజింగ్ స్టేషన్లు లేకనే..
స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టుల ఎగువ ప్రాంతంలో రేయిన్ గేజింగ్ స్టేషన్లు లేకపోవడంతోనే వరద ఉధృతిని గుర్తించలేకపోతున్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల్లోకి ఎంత మేరకు వరద వస్తున్నదన్న విషయం తెలుసుకునేందుకు ఇంజినీరింగ్ అధికారులు తంటాలు పడుతున్నారు. వరద తీవ్రతను తెలుసుకోవడంలో ఆలస్యం జరిగితే లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవలి కాలం వరకు కడెం ప్రాజెక్టు ఎగువన రేయిన్ గేజింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ ఆయా స్టేషన్లతో ప్రాజెక్టుకు అనుసంధానం లేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈసారి లింకేజీ పూర్తి కావడంతో వానకాలంలో ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రాజెక్టులకు ఎగువన గేజింగ్ స్టేషన్లు ఉండడం వల్ల వర్షపాతంతోపాటు వరద ఉధృతిని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల ఎగువ భాగాన గేజింగ్ స్టేషన్లతోపాటు, సెన్సార్లను ఏర్పాటు చేసి ఆకస్మిక వరదలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.