కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/సిర్పూర్-టీ, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. బ్యాంకుల్లో రూ. లక్ష లోపు రుణం తీసుకున్న అనేక మంది పేర్లు జాబితాలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అన్ని అర్హతలున్నా రుణాలు మాఫీకాకపోవడంపై అయోమయానికి గురి చేస్తున్నది. రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకుల వద్దకు వెళ్తే.. తమకు తెలియదని, వ్యవసాయ అధికారులను అడిగితే ఏమోనని సమాధానాలిస్తుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలోని సిర్పూర్-టీ మండలంలోని ప్రాథమిక సహకార సంఘంలో మొత్తం 824 మంది రైతులుండగా, 388 మంది రైతులు రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నారు. వీరిలో ఎవరికి రుణ మాఫీ అయిందో.. ఎవరికి కాలేదో సహకార బ్యాంకు అధికారులకు కూడా సమాచారం లేదు. అలాగే తిర్యాణి మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ద్వారా 538 మంది రైతులు రుణాలు తీసుకోగా, వీరిలో 462 మంది రైతులు రూ. లక్ష లోపు రుణం పొందిన వారున్నారు.
వీరిలో కేవలం 197 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా వారికి ఎందుకు కాలేదో తెలియడం లేదు. కౌటాల ప్రాథమిక సహకార సంఘంలో సుమారు 600 మంది రైతులు లక్షలోపు రుణాలు తీసుకున్న వారు ఉండగా, వీరిలో 349 మందికి మాత్రమే రుణమాఫీ అయింది.
ఇంకా 251 మంది రైతులకు ఎందుకు కాలేదో అధికారులకుగాని రైతులకు గాని తెలియడం లేదు… జిల్లాలోని 12 సహకార బ్యాంకుల పరిధిలో 10138 మంది రైతులకు రూ. 74 కోట్ల రుణాలు ఇచ్చారు. వీరిలో ఎంతమందికి మాఫీ అయిందో& ఎంతమందికి కాలేదో అంతుచిక్కడం లేదు. రుణమాఫీ ప్రక్రియ ఎలాంటి మార్గదర్శకాల ద్వారా చేశారో, తమకు రుణం ఎందుకు మాఫీ కాలేదో తెలియక రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
1.22 లక్షల మంది.. 125.50 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం జిల్లాలో రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు 1.22 లక్షల మంది ఉండగా, వీరికి రూ. 125.50 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. రూ. లక్ష లోపు పంటరుణం తీసుకున్న రైతులకు ఏక కాలంలో మాఫీఅయినట్లు రైతులకు సమాచారం ఇవ్వడంతో పాటు అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ, రూ. లక్ష లోపు బ్యాంకుల్లో రుణాలున్న వారికి కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యాలయాల బాటపడుతున్నారు.
తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో అర్థం కాక అధికారులను ఆశ్రయిన్నారు. లక్ష లోపు రుణం మాఫీ అయిన రైతుల జాబితాలో తమ పేర్లు ఎందుకు మిస్ అయ్యాయని రైతులు అడిగే ప్రశ్నలకు అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు రుణం మాఫీకాలేదో బ్యాంకు వారికి తెలుసని వ్యవసాయ అధికారులు అంటుంటే. వ్యవసాయ అధికారులకు తెలుసని బ్యాంకు అధికారులు అంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
బ్యాంకోళ్లు తెల్వదన్నరు
నాకు జైనూర్ బ్యాంకులో రూ. 65 వేల పంటరుణం ఉంది. కానీ మొన్న మాఫీ కాలే. లిస్టులో కూడా నాపేరు రాలే. బ్యాంకుకు వెళ్లి అడిగితే మాకు తెల్వదన్నరు. రుణం మాఫీ అవుతుందని ఎంతో ఆశపడ్డ. గీ కాంగ్రెసోళ్లను ఎంతో నమ్మినం. కానీ గిట్ల చేస్తరనుకోలే. ఇకనైనా మాకు న్యాయం చేయాలే.
– కొడప నాగోరావ్, గూడమామడ, జైనూర్ మండలం
చేస్తరో.. చేయరో..
నాకు వాంకిడిలోని స్టేట్ బ్యాంకులో రూ.లక్ష పంటరుణం ఉంది. రుణ మాఫీ జాబితాలో నా పేరు రాలే. వ్యవసాయయశాఖ అధికారులను అడిగితే తెల్వదని చెప్పిన్రు. తెలు సుకున్నాక చెబుతామన్నరు. పంట రుణం మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మమ్ముల మోసం చేసింది. మా ఆశలపై నీళ్లు చల్లింది. అసలు రుణం మాఫీ చేస్తరో.. చేయరో అర్థమైతలేదు.
– మర్సుకోల మల్కు, గూడమామ, జైనూర్ మండలం