హాజీపూర్, అక్టోబర్ 27 : ఏక్ పోలీస్ విధానం కోసం ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ శనివారం కానిస్టేబుళ్లు, వారి భార్యలు, కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ైప్లెవర్ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్న ఐదుగురు గుడిపేట బెటాలియన్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం కానిస్టేబుళ్లు బెటాలియన్ ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్ పీ వెంకట్రాములుకు వినతి పత్రం అందజేశారు. బెటాలియన్ వద్ద ఎస్ఐ గోపతి సురేశ్ ఆధ్వర్వంలో బందోబస్తు నిర్వహించారు.