ఆదిలాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిన్లో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కడ తడిసిపోతాయని బెంబేలెత్తిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు 42 వేల ఎకరాల్లో శనగ సాగు చేయగా.. 3.34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో అధికారులు మద్దతు ధరతో పంటను సేకరించారు. వివిధ మార్కెట్ యార్డుల పరిధిలోని గ్రామాలవారీగా షెడ్యూల్ ప్రకటించి శనగను సేకరించారు. ఎకరాకు ఏడున్నర క్వింటాళ్లు సేకరించడంతో రైతులు మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోని నష్టపోయారు. పది రోజులపాటు కొనుగోలు చేసిన అధికారులు టార్గెట్ పూర్తకావడంతో నిలిపివేశారు. దీంతో చాలా గ్రామాల్లో రైతులు తమ పంటను విక్రయించుకోలేని దుస్థితి నెలకొన్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో 80 వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ఎకరానికి 22 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జొన్నలను మద్దతు ధరతో విక్రయించి వానకాలం పంట పెట్టుబడి కోసం సిద్ధమవుతుండగా.. రైతులకు నిరాశే మిగులుతున్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్న క్వింటాలుకు రూ.3749 మద్దతు ధర ప్రకటించగా.. ప్రైవేటులో క్వింటాలుకు రూ.2500లతో కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.1249 తక్కువ ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. పంటను కోసిన రైతులు చేలలో నిల్వ ఉంచారు. జిల్లాలో రెండు రోజులుగా అకాల వర్షాలు పడుతుండడంతో జొన్నలు ఎక్కడ తడిసిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మంగళవారం బోథ్‌లో భారీ వర్షం పడగా.. చేలలో నిల్వ ఉంచిన జొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రైతుల జొన్నలు పాడయ్యాయి. పంట నిల్వల వద్ద రైతులు రాత్రి, పగలు కాపాల కాయాల్సి వస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిన శనగ కొనుగొళ్లతోపాటు జొన్నలను కొనుగోలు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. మంగళవారం జైనథ్‌లో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాలో శనగ పంటతోపాటు జొన్న పంటను కొనుగోలు చేసేంత వరకు ఆందోళనలు చేస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. పంటలు నిల్వచేసుకొనే స్థలం లేదని, వర్షాల వల్ల పంట నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. శనగల కొనుగోళ్లకు సంబంధించి అధికారులు గ్రామాలవారీగా షెడ్యుల్ ప్రకటించి మధ్యలో ఆపివేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు.