ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 22: విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు శృతిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కోసం ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మెలో భాగంగా ఆదివారం ఒంటి కాలిపై నిల్చుండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకురాలు శృతి మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
13 రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సీఆర్టీ పోస్టులను తాతాలిక పద్ధతిన నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తగదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు ఎవరూ కూడా దరఖాస్తు చేసుకోవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారాం, కోశాధికారి నగేశ్, మీడియా ప్రతినిధి సంతోష్ నాయకులు సందీప్, అన్నపూర్ణ, చైతన్య, ప్రశాంత్, రాజేశ్, కవిత, అనుప్, రాజేశ్, వెంకటేశ్, స్వప్న, సత్యనారాయణ, తిరుపతి, మహేశ్, ప్రసన్న, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.