ఖానాపూర్ రూరల్, నవంబర్ 26 : ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులకు సూచించారు. మండలంలోని తర్లపాడు, పాతతర్లపాడు గ్రామాల్లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి శనివారం పర్యటించారు. ఈ రెండు గ్రామాల్లో అధికారులు ఏర్పాటుచేసిన ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా న మోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామాల్లో బూత్ లెవల్ అధికారులు ఇంటింటా సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులు చేయాలని పేర్కొన్నారు. మరణించిన వా రిని ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్మోహన్, ఆర్ఐ రాజేశ్వర్ పాల్గొన్నారు.
అర్హుల వారు పేర్లు నమోదు చేసుకోవాలి
కుంటాల, నవంబర్ 26 : జిల్లాలో 1.1.2023 నాటికి 18 యేండ్లు పూర్తి చేసుకున్న వయోజనులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్మల్ అదనపు కలెక్టర్ పీ రాంబాబు అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కుంటాల మండలం కల్లూర్ 85, 86వ పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాబితాలో తప్పులు, మార్పులు, చేర్పులు సరిచేసుకునేందుకు సంబంధిత బీఎల్వోలు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.
అర్హులు ఫారం నం.6 ద్వారా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హులు తమ ఆధార్, రేషన్ కార్డులతో పాటు పదో తరగతి మెమోతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఖలీం, ఆర్ఐ విజయ్, సర్పంచ్ పద్మబాయి, బీఎల్వోలు ఉన్నారు.
వానల్పాడ్ గ్రామ పంచాయతీ సందర్శన
భైంసాటౌన్, నవంబర్, 26 : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ రాంబాబు వానల్పాడ్ గ్రామపంచాయతీని సందర్శించారు. ఓటరు నమోదు పత్రాలను పరిశీలించారు. సెక్రటరీ, అంగన్వాడీ టీచర్లకు సలహాలు, సూచనలిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. మార్పులు, చేర్పులుంటే సరిచేయాలని సూచించారు. ఆయన వెంట కార్యదర్శి చాట్ల గాయత్రి, సర్పంచ్ మాన్కుర్ పెద్ద రాజన్న, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, రాంకుమార్, అంగన్వాడీ టీచర్లున్నారు.