మంచిర్యాల, మే 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభా వం భారత్‌లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ దిగుమతులు రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమై పోవడం, గ్యాస్ కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా జనాలు లైన్లలో బారులుదీరడం, అవస్థలు పడడం చూశాం. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలు పెంచుతారంటూ ప్రచారం జరిగింది. ముందు నుంచి ధరల పెంపును కొట్టేస్తూ వచ్చిన కేంద్రంలోని మోదీ సర్కార్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యం లో ఎటువంటి ఇంధన భారం పెంచమని చెప్పింది. ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా మాట మార్చింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచింది. మొన్నటి వరకు రూ.2 వేలు ఉన్న సిలిండర్ ప్రస్తుతం రూ.3 వేలు దాటింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.993 అదనంగా పెంచింది. ఐదు కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల ధరను రూ.261.50 పెంచింది.
అలాగే పారిశ్రామిక వియోగదారులు వాడే బల్క్ డీజిల్ ధరను లీటర్ రూ.137 నుంచి రూ.149కి పెంచింది. కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్నాక్స్ సెంటర్ల నిర్వహకులపై అదనపు భారం పడనున్నది. మొన్నటి వరకు తీవ్రమైన కొరత నేపథ్యంలో కట్టెల పొయ్యిలపై వంటలు చేయాల్సి వచ్చింది. తాజాగా కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపు నేపథ్యంలో మొత్తానికి మొత్తమే కట్టెల పొయ్యికి పరిమితం కాక తప్పని సరి దుస్థితి నెలకొన్నదని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. మూడోసారి అధికారం కట్టబెడితే మోదీ సర్కార్ ఇచ్చిన గిప్ట్ ఇదంటూ సామాన్యులు వాపోతున్నారు. మోదీ అధికారంలోకి రాకముందు ఉన్న ఇంధన ధరలతో పోలిస్తే ప్రస్తుత ఇందన ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయంటూ మండిపడుతున్నారు.

కొనసాగుతున్న ఆంక్షలు
గ్యాస్ కొరత నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ఒ కసారి బుక్ చేశాక తిరిగి బుక్ చేయాలంటే దాదాపు నెల రోజులు ఎదురు చూ డక తప్పని దుస్థితి నెలకొన్నది. ఒక కనెక్షన్ ఉన్నవాళ్లు 21 రోజులు, రెండు కనెక్షన్లు ఉన్నవారు 25 రోజుల తరువాత బుక్ చేసుకోవాలని నిబంధనల విధించారు. దీంతో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మూడు నుంచి నాలుగు వారాలు ఎ దురు చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొన్నది. తాజాగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎన్ని సిలిండర్లు కావాలంటే అన్ని ఇస్తామని ఏజెన్సీ ల నిర్వాహకులు ఆఫర్ ఇస్తున్నారు. ఈ తీరుపై వ్యాపార వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి వరకు లేని స్టాక్ ఇప్పుడు ఎక్కడి నుంచి వ చ్చిదంటూ పలువురు మండిపడుతున్నారు. గ్యాస్‌కొరత, ధరల పెంపుతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. తాజా గా ధరల పెంపు ఫుడ్ సెక్టార్ వ్యాపార వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
గ్యాస్ దొరకక తిప్పలైతంది
ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏజెన్సీ వద్దకు వెళ్లి అడిగితే స్టాక్ లేదు అంటున్నరు. ఎప్పుడు పోయినా గట్లనే చెబుతున్నరు. తిరిగి.. తిరిగి యాష్టకొస్తుంది. గ్యాస్ అలవాటు అయినంక కట్టెల పొయ్యి మీద వంట చేసుడు కష్టమైతంది. ఓటీపీ రాకపోతే గ్యాస్ ఇస్తలేరు. ఇంతకుముందు మంచిగుండే. ఎప్పుడంటే అప్పుడు గ్యాస్ దొరికేది. ఇప్పుడు 25 రోజుల ముందే బుకింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నం. – అర్జున్, జన్కాపూర్
ఒక్క సిలిండర్‌తో ఇబ్బందైతంది
ఒక్కటే సిలిండర్‌తో ఇబ్బందైతంది. గ్యాస్ అయిపోతే ఒక్కోసారి వారం రోజులు దొరుకుతలేదు. 25 రోజుల ముందే బుకింగ్ చేయాలంటే ఎట్లా. సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో తెల్వక బుకింగ్ చేయలేకపోతున్నం. పని ఇడిసిపెట్టుకొని గ్యాస్ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తున్నాం. ఇదివరకు గ్యాస్ అయిపోయిన వెంటనే వస్తుండే. ఇకనైనా గ్యాస్ కష్టాలు తీరిస్తే బాగుంటది.
– శ్రీనివాస్, ఆసిఫాబాద్
