ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులతోపాటు రైతులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్‌లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశం పొందుతారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభం కానుండగా.. 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభించనున్నాయి. జైనథ్ మండలంలోని సాత్నాల సమీపంలో 100 ఎకరాల్లో స్థలాన్ని సేకరించగా.. ఇందులో భవన నిర్మాణాలు చేపట్టి బోధనా సిబ్బందిని నియమిస్తారు. 110 మంది ఉద్యోగులు నియామకం కానుండగా.. ఇందులో 66 మందిని రెగ్యూలర్, 44 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకోనున్నారు. ఫలితంగా విద్యార్థులతోపాటు రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
ఆదిలాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా తొమ్మిదేండ్లలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలు మెరుగుపడ్డాయి. పట్టణవాసులు, గ్రామీణుల్లో జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వం అందించిన సహకారంతో జిల్లాలో 15 నెలల కిందట ఐటీ కంపెనీ ఏర్పాటు అయింది. 130 మంది జిల్లా యువత ఇందులో పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఐటీ టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రిమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతుండగా, వివిధ విభాగాల్లో పీజీ చదువుకొనే అవకాశాలు లభించాయి. సీఎం కేసీఆర్ హామీ మేరకు జిల్లాలో కొత్తగా వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది. ఇందులో విద్యార్థులు వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు అభ్యసించి.. మంచి ఉద్యోగాలు సాధించే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం
ప్రభుత్వం మంజూరు చేసిన ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం 2023-24లో ప్రారంభమవుతాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 60 సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సును నాలుగేండ్లపాటు చదువుతారు. రాష్ట్రస్థాయితోపాటు ఆలిండియా లెవల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. జిల్లా విద్యార్థులు స్థానికంగా ఉంటూ చదువుకునే అవకాశం లభిస్తుంది. ఏటా ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 60 సీట్లు భర్తీ అవుతాయి. కళాశాల ఏర్పాటుతోపాటు 110 మంది ఉద్యోగులు నియామకం అవుతారు. వీరిలో 66 మందిని రెగ్యూలర్, 44 మందికి ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా తీసుకుంటారు. విద్యార్థులకు బోధించడానికి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తారు. కళాశాల భవన నిర్మాణానికి అధికారులు ఇప్పటికే జైనథ్ మండలం సాత్నాల సమీపంలో 60,61,62,63,78, 79,80,81, 101,104 సర్వే నంబర్లలో 100 ఎకరాల స్థలాన్ని సేకరించారు. కాలేజీకి అవసరమైన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపడుతారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రంలో తరగతులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తొమ్మిదేండ్లలో గణనీయమైన ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. తొమ్మిదేండ్లుగా జిల్లా విద్యా, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకు ఉన్నత చదువులు అభ్యసించే అవకాశంతోపాటు రైతులకు మేలు జరుగనుంది.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
రైతులకు ప్రయోజనం
ఆదిలాబాద్‌లో ప్రభుత్వం వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడం సంతోషకరం. కళాశాల ఏర్పాటుతో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. జిల్లాలోని రైతులకూ ప్రయోజనాలు చేకూరుతానున్నాయి. వ్యవసాయ ప్రొఫెసర్లు, విద్యార్థులు జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుల పంటలను పరిశీలించి వారితో మాట్లాడుతారు. వారి సమస్యలు, అధిక దిగుబడులుపై సలహాలు, సూచనలు అందజేస్తారు. రైతులు కూడా నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
– శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, ఆదిలాబాద్