వాంకిడి, ఏప్రిల్ 3 : ప్రజా సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి రేషన్ కార్డ్ దారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, రేషన్ డీలర్లు ఎలాంటి అవకతవకల పాలపాకుండా సక్రమంగా కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలను పరిశీలించారు. వేసవికాలం అయినందున సకాలంలో మొక్కలకు నీటిని అందించాలని, మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి మండల తాసిల్దార్ రియాజ్ అలీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, వివిధ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.