ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 20 : జిల్లాలోని చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా నీటిపారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీటిమట్టం, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని, సాగునీటి లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈలు గుణవంతరావు, ప్రభాకర్, డీఈఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లతో కలిసి పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డ్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌తో కలిసి పంచాయితీ రాజ్, విద్యాశాఖ, రోడ్లు-భవనాల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలుగా గుర్తించబడిన ప్రభుత్వ పాఠశాలల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, పనులు పురోగతి ఫొటోలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు నివేదిక రూపొందించి అందించాలని తెలిపారు.