ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 19 : పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను ప్రతి రోజూ పరిశీలించి, వివరాలు నమోదు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక వ్యయ పరిశీలకుడు జ్యాదవార్ వివేకానంద రాజేంద్ర సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో ఎన్నికల ఖర్చుల వివరాల నమోదు, పర్యవేక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో భాగంగా చేసే ప్రతి ఖర్చునూ తప్పనిసరిగా లెకించాలని తెలిపారు. పోలిం గ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చూడాలని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ, ఫిర్యాదులు, అక్రమంగా డబ్బు, మద్యం రవాణా నిరోధం, శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు.
ఎన్నికల ఖర్చు వివరాలను ప్రతిరోజూ పరిశీలించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు మించి ఖర్చులు ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్, స్టాటిస్టికల్, వీడియో సర్వేయలెన్స్, వీడియో పరిశీలన, అకౌంటింగ్ బృందాలను నియమించినట్లు తెలిపారు. కల్టెక్టరేట్లో కంట్రోల్ రూమ్, సీ- విజిల్ యాప్ ల ద్వారా ఇప్పటివరకు వచ్చిన 14 ఫిర్యాదులను పరిషరించినట్లు తెలిపారు.
ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలని రాజకీయ పార్టీల నాయకులకు తెలియజేశామని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించినట్లు చెప్పారు. ఎస్పీ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ డబ్బు, మద్య, కానుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.70 కోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు, సదయ్య, కరుణాకర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.