ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూన్ 22 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా శాఖల అధికారు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని 19 ఏళ్లలోపు వారికి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను సేకరించి డంప్యార్డులకు తరలిస్తున్నారన్నారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలున్నందున వాటి ప్రగతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జోడేఘాట్, మార్లవాయి, చింతలమాదర జలపాతం, గుండాల, మిట్టి జలపాతాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, జిల్లా సంక్షేమ అధికారి భాసర్, జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముషాన్ బాలి శ్యామ్, కార్తీక్, శ్రీనివాసన్, ఐశ్వర్య పాల్గొన్నారు.