ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 17 : వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్తో కలిసి హాజరయ్యారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నస్పూర్, సెప్టెంబర్ 17 : నన్పూర్లోని కలెక్టరేట్లో వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్, సెప్టెంబర్ 17 : దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నస్పూర్‌లోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్‌తో కలిసి హాజరయ్యారు. గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అమరవీరులు చేసిన పోరాటాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు. అంతకుముందు జడ్పీ కార్యాలయ భవన సముదాయంలో కలెక్టర్ కుమార్ దీపక్, జడ్పీసీఈవో గణపతితో కలిసి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.