దహెగాం, నవంబర్ 22 : వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లగ్గాం గ్రామానికి చెందిన ఇంగిలి చంద్రశేఖర్, చెమ్మకాని గంగన్న కొనుగోలు కేంద్రంలో ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించి ఎలాంటి సమస్యల్లేకుండా చూస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు.
దహెగాం మండల విలేకరుల ఐక్యతను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ప్రశంసించారు. మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌ను ఆయన సందర్శించారు. ఇంత మారుమూల ప్రాంతం లో ఐక్యంగా ఉండి సొంత భవనం నిర్మించుకోవడంతో పాటు అందులోనే డా.బీఆర్ అంబేద్కర్ పేరుతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందిస్తానని చెప్పారు. డీఎం జేవీ నరసింహారావు, ఏఎస్వో సాదీక్, డీసీవో బిక్కునాయక్, డీఆర్డీవో దత్తారార్, సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, తహసీల్దార్ దామెర కవిత, ఎంపీడీవో రాజేందర్, ఏడీఏ మనోహర్ పాల్గొన్నారు.