ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 8 : పల్లెల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం బూరుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలసి మొకలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఇంటింటా సర్వే చేసి జ్వరపీడితులను గుర్తించాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వీధి కుకల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడుతూ మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీ పనులు చేసి మూడు నెలలవుతున్నా డబ్బులు రాలేదని కూలీలు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా, పీడీతో మాట్లాడి మూడు రోజుల్లో అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ ప్రాజెక్టు అధికారి దత్తారం, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీలత పాల్గొన్నారు.