కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జేసీ డేవిడ్(రెవెన్యూ)తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రవాణా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి వచ్చే రహదారుల్లో హుడ్కిలి, వెంకట్రావ్‌పేట్, వాంకిడి, గూడెం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటి సుమారు రూ. 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెక్‌పోస్టు వద్ద నిఘా పెడుతున్నామని, ఇంటెలీజెన్సీ ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.
రైతులు కూడా నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లైసెన్స్‌లు కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, విడిగా అమ్మే విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. నకిలీ విత్తనాలు ఎక్కడైనా ఉన్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఉన్న డీలర్స్కు అవగాహన కల్పించేందుకు త్వరలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. అన్ని రకాల భూ సమస్యలకు భూ భారతి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం జిల్లాలో 90 శాతం విజయవంతం అయిందని, ప్రతి నెలా రేషన్ కార్డుల లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు. పేదలకు అందించే సన్నబియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఆయా మండలాల ఎంపీడీవోలు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, 22 నుంచి 30 వరకు గెజిటెడ్ అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి లబ్ధిదారుల లిస్ట్ తయారు చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.