ఇచ్చోడ(సిరికొండ), జనవరి 16 ః ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో తిరుగుతూ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారును పకడ్బందీగా గుర్తించాలన్నారు. అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చొద్దని, చేరిస్తే పూర్తి బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. మండల నాయకులు శ్మశాన వాటిక నిర్మించాలని, ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాస్ మాలవీయ, డీఎల్పీవో ఫణిందర్, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ తుకారం పాల్గొన్నారు.
జున్ని, అడిగామ(కే), అడిగామ(బీ), ఇచ్చోడలలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్యామలదేవి పర్యటించారు. ఈ సందర్భంగా రైతుభరోసా పథకం కోసం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సర్వేను పరిశీలించారు. వ్యవసాయేతర భూములు, లే అవుట్లు, ఫ్యాక్టరీలు, సాగులో లేని భూములను రైతు భరోసా పథకం నుంచి తొలగించారు. ఆమె వెంట వ్యవసాయ శాఖ ఏడీ రామకిషన్, మండల వ్యవసాయాధికారి జాదవ్, కైలాశ్, ఏఈవో జీవన్ నాయక్, తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.