ఎదులాపురం, డిసెంబర్ 11: గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్ అర్బన్ పరిధిలో 14, ఆదిలాబాద్ రూరల్‌లో 4, మావలలో 10, జైనథ్‌లో 1 మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో 10,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, శాఖాపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను నియమించామన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తామని, పరీక్ష పత్రాల బందోబస్తు, కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ చేయాలని ఆదేశించారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగు దఫాలుగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ, డీఎస్పీ జీవన్‌రెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్ జగ్రాం అంతర్బెడి పాల్గొన్నారు.