ఎదులాపురం, డిసెంబర్13 : ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడుత ఎన్నికలు డిసెంబర్ 14న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ప్రచారం ముగించినట్లు తెలిపారు.ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ర్యాలీలు, మైక్ అనౌన్స్ మెంట్లు, మోటార్ షోలతో పాటు ఎలాంటి కార్యక్రమాలకు నిర్వహించకుండా కఠినంగా నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రశాంతత దృష్ట్యా, సంబంధిత 8 మండలాల్లో సెక్షన్.163 బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎకువ మంది ఒకచోట గుమిగూడడం నిషేధమని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే, ఎనిమిది మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్, ఓట్ల లెకింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు.
ఈ నెల 14న పోలింగ్ అనంతరం, అదే రోజు మధ్యాహ్నం తర్వాత మండల కేంద్రాల్లో ఓట్ల లెకింపు జరగడంతో ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతం వాతావరణంలో జరుగేందుకు అన్ని శాఖలు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాయని పేరొన్నారు. ఎన్నికల నిబంధనలు గౌరవించి ఆయా గ్రామాల్లోని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు.