Blood Donation | ఆదిలాబాద్ : ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే ఆపద సమయంలో ఉపయోగ పడుతుందని, రక్తం ఏ సమయంలో ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికి తెలియదన్నారు. ప్రమాదాల బారిన పడిన సమయంలో, రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇలా రకరకాల సమయాల్లో రక్తం అవసరమవుతుందని, స్వచ్ఛంద సంస్థలు రక్తదానాల శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆపదలో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు రక్తదానం శిబిరాలు నిర్వహించటం అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉంటే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని ఆన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలోని బ్లడ్ బ్యాంక్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, అందుకు స్వచ్ఛంద సంస్థల కీలక పాత్ర ఎంతో ఉందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించడం వల్ల రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ కు గొప్ప పేరు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వచ్చిందని ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. రక్తదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రక్తదాన దినోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్ ఎం ఓ సాయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృష్ణ, అబ్దుల్ అజీజ్, పసుపుల రాజు, రామచంద్ర మహాత్మా, హేమావతి, సత్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.