పెద్దపల్లి, మార్చి 18(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, జీవీ శ్యామ్ ప్రసాద్లాల్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 వరకు నామినేషన్ల స్రూటీని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1850 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 15 లక్షల 92 వేల 996 మంది ఓటర్లు, 1395 మంది సర్వీస్ ఓటర్లు, 102 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారన్నారు.