నస్పూర్, డిసెంబర్ 31 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక తీయడం జరిగిందని, సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుందని, చెక్‌పోస్టుల ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
ఈ యేడాది చింతపల్లి వే బ్రిడ్జి నుంచి 328 ట్రిప్పుల్లో 1,312 మెట్రిక్ టన్నుల ఇసుకను రూ.47,468లకు, కొల్లూరు వద్ద 3 వేబ్రిడ్జిల నుంచి 78 ట్రిప్పుల్లో సుమారు 2,340 మెట్రిక్ టన్నుల ఇసుకను రూ. 8,77,500లకు విక్రయించినట్లు తెలిపారు. ఒక ట్రిప్పులో దాదాపు 30 మెట్రిక్ టన్నుల ఇసుక ఉంటుందని, అంతకుమించి ఉంటే అన్లోడింగ్ చేయడం జరుగుతుందన్నారు. కిలో ఇసుక కూడా నిబంధనలకు మించి లోడింగ్ చేయలేదని తెలిపారు. ఓవర్ లోడ్‌తో ఇసుక తరలిస్తున్న అంశంలో 2023లో 32 కేసులు నమోదు చేసి రూ. 10,77,120, 2024లో నాలుగు కేసులు నమోదు చేసి రూ.2,12,360 జరిమానా రుసుం వసూలు చేయడం జరిగిందన్నారు.
ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల, చెన్నూరు మండలం అక్కెపల్లి, నెన్నెల మండలం ఖర్జీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రీచ్‌ల ద్వారా స్థానిక అవసరాలకు ఇసుకను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పత్రికలు, చానళ్లలో ఇసుక అక్రమ రవాణాపై వివిధ కోణాల్లో వార్తలు వస్తున్నాయని, ఒక్కసారి ప్రజల్లోకి వెళ్లిన వార్తను తిరిగి తీసుకోలేమని, పాత్రికేయులు బాధ్యతగా వ్యవహరించి ఈ అంశంపై నిజ నిర్ధారణ చేసుకుని, పూర్తి ఆధారాలతో వార్తలు ప్రచురించాలని, ప్రసారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, అధికారులు పాల్గొన్నారు.