నస్పూర్, ఫిబ్రవరి 20 : జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడం జరిగిందని, ప్రస్తుతం సర్వర్ రిస్టోర్ ప్లానింగ్ ప్రక్రియ కొసాగుతుందని తెలిపారు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం వివరాల ప్రకారం కొనుగోళ్లు చేపట్టి సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారన్నారు. టోకెన్ పద్ధతిలో పత్తి కొనుగోళ్లు చేయడం జరుగుతుందని, రైతులు సహకరించాలని తెలిపారు.
లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో 39,512 దరఖాస్తులు రాగా, 9,500 నిషేధిత భూములుగా గుర్తించడం జరిగిందని, ప్రాథమిక స్థాయిలో రెవెన్యూ, నీటి పారుదల శాఖ పరిధిలో 7444 దరఖాస్తులు ఉన్నాయని, రెండో స్థాయిలో పట్ణణ ప్రణాళిక విభాగం పరిధిలో 3,790 దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. 3745 ఆమోదించగా, 130 మంది లబ్ధిదారులు రుసుం చెల్లించడం జరిగిందని, 3615 మంది చెల్లించాల్సి ఉందన్నారు.
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 20 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఐబీ చౌరస్తాలో కొనసాగుతున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు సూచనలు చేశారు.
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 20 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కుమార్ దీపక్ సందర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరు, ఇంటింటీ రీసర్వే, పన్నుల వసూళ్లు, తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఆయా విభాగాల్లో చేపడుతున్న పనుల గురించి ఆరాతీశారు. కార్పొరేషన్‌గా మారిన తర్వాత ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి అనుమానాలున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించారు.