తాండూర్, జూలై 22 : తాండూర్ మండలం బెల్లంపల్లి ఏరియా పరిధిలోని ప్రతిపాదిత మహావీర్ ఖని ఓపెన్‌కాస్ట్ కోసం భూసేకరణకు అన్ని పత్రాలనూ సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం మహావీర్ ఖని ఓపెన్ కాస్ట్ హద్దులు, ఓపెన్ కాస్ట్ స్థలాన్ని, మ్యాప్‌తో పాటు ఎంవీకే-1 పాత చెక్‌పోస్ట్ నుంచి ఎంవీకే-3 గ్రామ శివారు వరకు ఉన్న ఓపెన్‌కాస్ట్ ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
ఓపెన్‌కాస్ట్ ఏర్పడితే బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, గని జీవిత కాలం, స్థానికంగా ప్రభావితమయ్యే అంశాలు, స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలపై సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నాలా అనుమతులు ఉన్నాయా ? అని రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కుమార్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరాం రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ మహేశ్, మండల సర్వేయర్ రామకృష్ణ తదితరులున్నారు.
కాసిపేట/బెల్లంపల్లి, జూలై 22 : మందమర్రి ఏరియాలోని సింగరేణి కల్యాణిఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామంలోని నాన్ ఫారెస్ట్ ల్యాండ్ (ఎన్ఎఫ్ఎల్) భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక రైతులు, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ చేయాలని, ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, కేకే ఓసీ పీవో రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి బుధవారం భూసేకరణకు సంబంధించి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, అధికారులతో కలిసి చిర్చించారు. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం తహసీల్ధార్ కార్యాలయంలో సర్, భూభారతి, సాదాబైనామా తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.