ఎదులాపురం, జనవరి 19 : అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామసభలపై ఆదివారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలకు విసృ్తత ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన ప్రజపాలన గ్రామసభల మాదిరిగానే నిర్వహించాలని, రోజు ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే గ్రామసభలు నిర్వహించాలని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియ అని అన్నారు. గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన(సామాజిక) సర్వే ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని పేరొన్నారు. గ్రామసభలో కలెక్ట్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నంబర్, పేర్లు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అడ్రస్ తీసుకోవాలన్నారు.
ఎవరిదైనా పేర్లు మిస్ అయితే ప్రజాపాలన మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతిదీ రిజిష్టర్లో నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబితా ఇంటి స్థలం లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలన్నారు. అలాగే కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజులపాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తామన్నారు. గూగుల్ మీట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, సీఈవో జితేందర్ పాల్గొన్నారు.