నస్పూర్, జూన్ 5 : స్వచ్ఛమైన వాతావరణంలోనే జీవరాశి మనుగడ సాధ్యమని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మంచిర్యాల కలెక్టరేట్ ఆవరణలో అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల, సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్యతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరితో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్, జూన్ 5 : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్‌మిల్లులకు సామర్థ్యం మేరకు కేటాయించామని, ఆ మేరకు సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఉమారాణితో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 286 కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లు పూర్తయిన 281 కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని, 5 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పెద్దపల్లికి తరలించిన ధాన్యం సంబంధిత నగదును ఆయా రైతుల ఖాతాల్లో త్వరలోనే జమ చేస్తామని తెలిపారు.