నస్పూర్, ఫిబ్రవరి 29 : మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, ఆబ్కారీ మద్యపాన నిషేధ శాఖ పర్యవేక్షకుడు నందగోపాల్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై నిఘా పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాలు రవాణా చేసే వారికి 20 ఏళ్ల జైలు, రూ. 2 లక్షల జరిమానా, అవసరమైతే మరణ శిక్ష కూడా విధించే అవకాశముందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ప్రిన్సిపాల్ చక్రపాణి పాల్గొన్నారు.