లక్ష్మణచాంద, నవంబర్ 7 : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇక్క ట్లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. గురువారం పీచరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాలు పేరిట కిలో ధాన్యం అధికంగా జోకిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు, తప్ప తొలగించే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన పత్రాన్ని రైతులకు అందజేయాలని అధికారులకు సూచించారు.
రైతులు ఇబ్బంది అయితే సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. అనంతరం పీచరలో సర్వేను, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. పొట్టపెల్లి(కే) గ్రామంలోని గోదాంను పరిశీలించారు. ఆమె వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ జానకీ, ఎంపీడీవో రాధిక, తదితరులు పాల్గొన్నారు.