మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిర్పూర్(యు), నవంబర్ 22 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 9.9 డిగ్రీలు నమోదయ్యాయి.
తిర్యాణిలో 11, కెరిమెరి, వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్, చింతలమానేపల్లి, కాగజ్నగర్, బెజ్జూర్, లింగాపూర్లలో 12 నుంచి 14, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 11.5, బజార్హత్నూర్లో 11.8 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రజానీకం గజగజ వణికిపోయింది. ఉదయం ఎనిమిదైనా మంచు తొలగకపోవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాత్రివేళల్లోనే కాకుండా పగలంతా కూడా ఇగం పెట్టింది. ఉదయం.. సాయంత్రం చిన్నా పెద్దలంతా ఒకేచోట చేరి నెగడి మంటలు వేసుకోవడం కనిపించింది.