ఆదిలాబాద్/నిర్మల్, జూలై 27(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఏకధాటిగా కుండపోత వాన పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, యంత్రాంగం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నది. కాలనీలు జలమయం కాగా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. వరదతో పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడక్కడా ఇండ్లు కూలిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రమాద ఘంటికలు మోగాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షించారు. ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కడెం గ్రామాన్ని ఖాళీ చేయించారు. కడెం, దస్తూరాబాద్ మండలాల్లోని 12 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం కొంత ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరణం బ్రిడ్జి వద్ద వాగు ఉధృతిని ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఊట్నూర్‌లోని అంబేద్కర్ చౌక్ షాపింగ్ కాంప్లెక్స్‌లు నీట మునిగాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్నగర్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య సందర్శించారు. పలు కాలనీల నుంచి ప్రజలను పునరావాసా కేంద్రాలకు తరలించారు. హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, డీసీపీ రామ్‌నాథ్ కేకన్‌తో కలిసి పరిశీలించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో పది రోజులుగా వర్షం కురుస్తుండడంతో 88 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓసీపీ క్వారీలో మట్టి తవ్వకాలు, రవాణా(ఓబీ) పనులు నిలిచాయి. దండేపల్లి మండలం ద్వారక, గుడిరేవు గోదావరి వద్ద వరద ముంచెత్తడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు, గుండి వాగు ఉధృతిని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. చింతలమానేపల్లి మండలం దిందా-కేతిని, బాబాసాగర్-నాయకపుగూడ వాగులతో పాటు గూడెం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత వరద ఉధృతిని కలెక్టర్ బోర్కడే హేమంత్, ఎస్పీ సురేశ్‌కుమార్ పరిశీలించారు.