కాగజ్‌నగర్, జూలై 4 : ‘నన్ను చంపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.’ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్హాల్లో 120 మంది విద్యార్థులకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారి సహకారంతో స్వేరోస్ ఆధ్వర్యంలో రూ. కోటి స్కాలర్షిప్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పోలవరం నింపడానికి కన్నెపల్లి పంప్ హౌస్‌ను బంద్ చేయిస్తున్నాడని ఆరోపించారు. రైతుల కన్నీళ్లు తుడవడానికి కన్నెపల్లి పంప్ హౌస్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తే, ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఎల్‌నినో ప్రమాదం పొంచి ఉందని, వానలు పడడం లేదని, కాళేశ్వరం నీళ్లన్నీ ఆంధ్రకు తరలిపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు. రైతులకు నీరు, విత్తనాలు యూరియా రావడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టర్లకు డబ్బులు రావడం లేదని, మన సొమ్ము ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టే మేడిగట్ట రిపేర్ చేయడం లేదని, సిర్పూర్ ప్రాంత పేద అమ్మాయిలకు ఈ స్కాలర్ షిప్ అందించడానికి సహకరించిన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేష్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
చిన్న వయసులో వివాహం చేసుకోకుండా, ఆర్థికంగా బలపడిన తర్వాతే వాహం చేసుకోవాలన్నారు. గతేడాది సిర్పూర్ప్రాంత విద్యార్థులకు సంతూర్ స్కాలర్షిప్లు అందేలా కృషి చేశామన్నారు. అనంతరం సిర్పూర్ ప్రాంత పేద బిడ్డలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్కాలర్ షిష్‌లు పొందిన విద్యార్థినులందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా నాయకులు డోంగ్రి సురేశ్, కో ఆర్డినేటర్ మమత, అమ్మాయిల తల్లిదండ్రులు, నాయకులు మినాజ్, రాజు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.