మంచిర్యాల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ నస్పూరులోని కొత్త కలెక్టరేట్ సమీపంలోగల మైదానంలో నిర్వహించిన సభ జనప్రభంజనాన్ని తలపించింది.
బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ హెలీక్యాప్టర్‌లో రాగానే.. జనం కేరింతలు కొట్టారు. కేసీఆర్ సభా వేదిక మీదకు రాగానే జనం చేతులు ఊపుతూ అభివాదం చేశారు. గ్యాలరీల్లో ఉన్న వారంతా ఒకరికంటే.. మరొకరు పోటీపడి నినాదాలు చేయడం, ఈలలు వేయడం చేశారు.
చిరుజల్లులు పడుతున్నా లెక్క చేయకుండా కేసీఆర్ ప్రసంగం విన్నారు. అనుకున్నదానికంటే రెండింతలు జనం ఎక్కువగా రావడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు చప్పట్లు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలతో ఉర్రూతలూగించారు. రైతుబంధు దుబారానా.. అది ఉండాల్నా.. వద్దా.. కరెంట్ 24 గంటలు ఉండాల్నా.. వద్దా.. ధరణి కావాల్నా వద్దా.. అని సీఎం ప్రశ్నించినప్పుడు సభలో ఉన్న వేలాది మంది కావాలంటూ ముక్త కంఠంతో చెప్పడం హైలెట్‌గా నిలిచింది.
సభకు వచ్చిన వారి ఉత్సాహాన్ని చూసి సీఎం కేసీఆర్ మరింత జోష్‌తో మాట్లాడారు. ‘తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి.. ఎల్లమ్మ కూడ బెడితే మల్లమ్మ మాయం చేసింది అన్నట్లు..’ అని ప్రసంగంలో సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు జనం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది. ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, నియోజకవర్గ ఇన్చార్జి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ పాల్గొన్నారు.
– మంచిర్యాలటౌన్, నవంబర్ 24