ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడలో గురువారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా.. జన ప్రభంజనాన్ని తలపించింది. ఫ్లెక్సీలు.. జెండాలతో ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. సీఎం కేసీఆర్ హెలీకాప్టర్‌ను చూడగానే జనం చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వేదికలపైకి చేరుకోగానే.. నినాదాలతో హోరెత్తించారు. సభా ప్రాంగణాలు నిండిపోగా గోడలపై కూర్చొని, రోడ్లపై నిల్చొని సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్నప్పుడు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఉర్దూలో మాట్లాడుతున్నప్పుడు ముస్లింలు కేరింతలు కొడుతూ బీఆర్ఎస్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతుబంధు, ఉచిత కరెంట్ కావాల్నా…వద్దా… అన్నప్పుడు.. కావాలంటూ అందరూ చేతులెత్తారు. పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని వివరిస్తున్నప్పుడు జనం చప్పట్లతో మారుమోగించారు. జోగు రామన్న, అనిల్ జాదవ్‌ను గెలిపించాలి అనగానే.. ఈలలు వేశారు.
గాయని మధుప్రియ ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారులు ఆటా.. పాటలతో హోరెత్తించారు. గులాబీల జెండలే…రామక్క అంటూ మధుప్రియ పాడిన పాటకు స్టేజీపై ఉన్న నాయకులు సైతం గులాబీ కండువాలు ఊపుతూ నృత్యం చేశారు. జన ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులు జోగురామన్న, అనిల్‌జాదవ్ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.
– ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ)/బోథ్, నవంబర్ 16