రాష్ట్ర సర్కారు రైతన్నకు తీపికబురు అందించింది. గత ఎన్నికల సమయంలో పంట రుణాలను మాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడుతలుగా మాఫీ చేశారు. మొదటి విడుతలో రూ.25 వేల లోపు, రెండో విడుతలో రూ.50 వేల లోపు వాళ్లకు మాఫీ చేశారు. తాజాగా మంగళవారం మరికొంత మందికి మాఫీ చేయాలని బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి పునఃప్రారంభించాలని పేర్కొన్నారు. తాజా ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. చెన్నూర్‌లో పాలాభిషేకం చేసి, టపాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
‘తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని కొనసాగించినం. కరోనా ఉపద్రవం, నిధుల కేటాయింపులో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల కొంత జాప్యం జరిగింది.ఎన్ని కాష్టాలొచ్చినా రైతుల సంక్షేమానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా.’
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు 2,98,771 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే రెండు విడుతలుగా రాష్ట్ర సర్కారు మాఫీ చేసింది. మొదటి విడుతలో రూ.25 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు, రెండో విడుతలో రూ.50 వేలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మొదటి విడుతలో రూ.25 వేల లోపు తీసుకున్న రైతులు 30,229 మంది రుణం మాఫీ అయింది. రెండో విడుతలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులు 65 వేల మంది ఉండగా.. ఇందులో 24 వేల మందికి మాఫీ అయ్యాయి. కరోనా కారణంగా మొత్తం చేయలేక పోయారు. మంగళవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి కొంత మందికి రుణం మాఫీ కానుంది. పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Adilabad1
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
చెన్నూర్, ఆగస్టు 2 : రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, ఎంపీపీ మంత్రి బాపు, కిష్టంపేట ఎంపీపీ నాగోతు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మానికరౌతు శంకర్, ఖాజా ఖంరొద్ద్ధీన్, మద్ద మధూకర్, రుద్రబట్ల సంతోష్, రైతు బంధు సమితి చెన్నూర్ అధ్యక్షుడు నెన్నల భీమయ్య, భీం మధు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, మేడ సురేశ్‌రెడ్డి, వేముల మహేందర్, ఖలీల్, నాయకలు వినయ్, కొండపర్తి వెంకటరాజం, జడల మల్లేష్, అరీఫ్, మానిశెట్టి శ్రీనివాస్, చకినారపు రాజేశ్, రైతులు పాల్గొన్నారు.
మళ్లీ సీఎం కావడం ఖాయం..
కుభీర్, ఆగస్టు 2 : ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. రుణమాఫీ చేస్తడో చేయడో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేసినం. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణాలను మాఫీ చేస్తూ ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం నిజంగా రైతులకు మనోధైర్యాన్ని కల్పించింది. కేసీఆర్‌ను జీవితాంతం మరిచిపోం. కాంగ్రెస్ వాళ్ల మాటలు ఎవరూ నమ్మరు. రుణమాఫీ ప్రకటన రాకుంటే ప్రతిపక్షాలు ఎగిరి గంతులేసేవి. వారికి బుద్ధి చెప్పేలా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేసి అన్నదాతలందరికీ అండగా నిలిచారు.
– గోజల గజ్జారాం, రైతు, పార్డి(కె).
అనుకున్నదే జరిగింది..
కుభీర్, ఆగస్టు 2 : మొన్ననే రైతులందరం ఒక చోట కూర్చొని రైతుల రుణాలను మాఫీ చేస్తడో లేదో కేసీఆర్ అంటూ చర్చ జరుగగా తప్పకుండా మాఫీ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోతడని నేను గట్టిగా చెప్పా. వారందరూ నన్ను డబ్బులే లేవు ఎక్కడి నుంచి రుణమాఫీ చేస్తడని వ్యంగ్యంగా అన్నారు. అందరం అనుకున్నదే ఈ రోజు జరిగింది. రైతుల రుణాలు మాఫీ చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతుల పక్షపాతి అనడానికి వందశాతం నిదర్శనం. ఆయనకు రైతుల దీవెనలు తప్పకుండా ఉంటాయి.
– దొంతుల లింగన్న, రైతు, కుభీర్.
చాలా సంతోషంగా ఉంది..
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 2 : పంట మీద తీసుకున్న రుణం లక్ష రూపాయ ల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట ప్రకారం రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. నాతోపాటు చాలా మంది రైతులకు మేలు జరుగుతుంది. గతంలో కొంత మందికి మాత్రమే మాఫీ అయి మాకు కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యాం. ఇక మాఫీ మాట అంతే అనుకున్నం. ఈనిర్ణయంతో ఇక వన్ టైం సెటిల్మెంట్ మాదిరిగా ఒక్కసారిగా బ్యాంకు లోను మాఫీ కానుంది.
– ఒడ్డె మహేందర్, గుడిపేట, హాజీపూర్.
సీఎం నిర్ణయం హర్షనీయం
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 2 : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ నిర్ణయం తీసుకో వడం ఆనందంగా ఉంది. 2018లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి విడుతలవారీగా మాఫీ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మిగిలిన మొత్తం శాతాన్ని మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకొని డబ్బులు కేటాయించడం హర్షనీయం.
– అక్కల పరమేశ్, వెల్గానూర్, దండేపల్లి.