రైతన్నల కోసం టీఆర్ఎస్ పోరుబాట
యాసంగి వడ్లు కొనకుంటే మరో ఉద్యమమే..
బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన సీఎం కేసీఆర్
పంజాబ్‌కో నీతి.. తెలంగాణకు మరొకటా?
కేసీఆర్ వెంటే ఉంటామంటున్న అన్నదాతలు
కేంద్రం కొనకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన
రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తీర్మానాలు
నేడు అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు
విజయవంతం చేయాలని ఎమ్మెల్యేల పిలుపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.46 లక్షల ఎకరాల్లో సాగు
2.88 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఆదిలాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్లకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతన్నల ప్రయోజనాల కోసం ఏకంగా ఢిల్లీపై రణభేరి మోగించారు. నాడు ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి చలించిన కేసీఆర్.. నేడు ఆ దుస్థితి నుంచి బయట పడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు.. ఇలా ఎన్నో పథకాలతో ఏడేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చారు. అయితే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ.. ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోళ్లపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నది. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పోరుబాటకు ఉమ్మడి జిల్లా రైతులు సై అంటున్నారు. సీఎం వెంటే మేముంటామంటూ స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిని తలపించిన వ్యవసాయ భూములు స్వరాష్ట్రంలో పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంట్, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూములు సస్యశ్యామలంగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడేళ్లుగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. వానకాలంలో 17.80 లక్షలు, యాసంగిలో 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై వివక్షను ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ ధాన్యాగారంగా మారింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ ద్వారా రైతులకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పింది. పంజాబ్‌లో వరిని సేకరిస్తున్న కేంద్రం తెలంగాణలో వ డ్లను కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పలుమార్లు కోరినా బీజేపీ పెద్దలు మాత్రం మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2.88 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ యేడాది యాసంగిలో 1.46 లక్షల ఎకరాల్లో రైతులు ధాన్యం సాగు చేశారు. ఈ సీజన్లో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట వేయగా 1.40 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్‌లో 66 వేల ఎకరాల్లో పంట సాగవగా 1.32 లక్షల మెట్రిక్ టన్నులు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7,745 ఎకరాల్లో పంట వేయగా 15,490 మెట్రిక్ టన్నులు, ఆదిలాబాద్ జిల్లాలో 338 ఎకరాల్లో వరి వేయగా 676 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రానున్నది. జిల్లాలోని వరి రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై సమరశంఖం పూరించింది.
గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు..
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్‌లో మంగళవారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణ రైతుల వడ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనాలని ఈనెల 31లోగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. 25న గ్రామ పంచాయతీ, 26న మండల పరిషత్, 27న జిల్లా, మండల రైతుబంధు సమితులు, 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ కమిటీలు, 29న డీసీసీబీ, డీసీఎంఎస్, 30న జిల్లా పరిషత్, 31న అన్ని మున్సిపాలిటీల పాలకవర్గ తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.
తీర్మాన కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈనెల 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని, పార్టీ నిర్ణయించిన తేదీల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైనా నల్ల జెండాలు ఎగురవేయాలని, ప్రతీ మండలకేంద్రంలో విధిగా పెద్ద ఎత్తున నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ సమయంలో ఎంపీలు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. ‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’.. నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామ స్థాయిల్లో అందరినీ కలుపుకొని సీఎం పిలుపును విజయవంతం చేసుకుందామని తీర్మానం చేశారు.
కేంద్రం మెడలు వంచుతాం..
వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం.. మన వడ్లు మాత్రం కొనడం లేదు. పంటల కొనుగోళ్లకు సంబంధించి అన్ని రాష్ర్టాలకు ఒకే విధంగా ఉండేలా జాతీయ స్థాయి ప్రొక్యూర్మెంట్ పాలసీని రూపొందించాలి. కేంద్రం మెడలు వంచి వడ్లను కొనుగోలు చేయిస్తాం. నేడు(గురువారం) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. 25 నుంచి 31 వరకు అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి, ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపిస్తాం.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి.