నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగా, స్థానికంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ముథోల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం పాల్గొంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సంబురం అంబరాన్నంటింది. వేలాది మందితో ర్యాలీ తీయగా, దారిపొడవునా ‘జై కేసీఆర్’ నినాదాలతో మార్మోగింది. డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలతో యువత హోరెత్తించగా, వైద్య విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. మెడిసిన్ కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రికి ‘థ్యాంక్స్ టూ కేసీఆర్’ అంటూ కృతజ్ఞతలు చెప్పారు.
దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. ఈ రోజు 9 జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. గతంలో కేవలం 5 కాలేజీలు మాత్రమే ఉండేవి, దశాబ్ద కాలంలో కొత్తగా 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతారు. వైద్య రంగంలో ఇది గణనీయ పురోగతి.
– సీఎం కేసీఆర్
నిర్మల్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఏళ్ల నుంచి ఎదురు చూసిన మెడికల్ కాలేజీని శుక్రవారం సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకల సంబురం అంబరాన్ని తాకింది. సీఎం కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ఈ కాలేజీని ప్రారంభించగా, స్థానికంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ప్రారంభ వేడుకల సందర్భంగా నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైద్యారోగ్యశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడవునా ర్యాలీలో పాల్గొన్న వారి నినాదాలు మిన్నంటాయి. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అలాగే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృషికి ధన్యవాదాలం టూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మెడికల్ కాలేజీ సమీపంలోని దివ్యా గార్డెన్స్ వరకు చేరుకుంది. విద్యార్థులు, స్థానికులు అక్కడే ఉండగా, మంత్రితో పాటు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఉదయం 11.30 గంటలకు మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని మిగతా 8 కాలేజీలతో పాటు నిర్మల్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నూతనంగా చేరిన వైద్య విద్యార్థులనుద్ధేశించి సీఎం మాట్లాడారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందన్నారు. 2014 కంటే ముందు రాష్ట్రంలో కేవలం 2850 మెడికల్ సీట్లు ఉండగా, కొత్త కాలేజీల ఏర్పాటుతో 8515 సీట్లు పెరిగాయన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఒకే సారి 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవ లం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఈ దశాబ్ద కా లంలో కొత్తగా 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలతో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతారని తెలిపారు. వైద్య రంగంలో ఇది గణనీయమైన పురోగతి అని చెప్పారు.
నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల డిమాండ్ అయిన మెడికల్ కాలేజీని నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అటవీ,పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నిర్మల్ మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మంత్రి విద్యార్థులు, వైద్యారోగ్యశాఖ సిబ్బందినుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. నిర్మల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ ఊహించలేదని, సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలే ఉండేవని గుర్తు చేశారు. కొంతకాలం తర్వాత వరంగల్ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యిందన్నారు. డాక్టర్ కావాలంటే ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడుకున్న పని అని, భయపడి చాలా మంది వైద్యవిద్యకు ముందుకు రాలేదని గుర్తు చేశారు. నిర్మల్ మెడికల్ కాలేజీలో జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందడం చాలా సంతోషకరమని, వారిని అభినందిస్తున్నానన్నారు. రూ.45 కోట్లతో నిర్మించుకున్న ఇక్కడి మెడికల్ కాలేజీ భవనంలోనే 300 పడకల ఆసుపత్రి కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నదన్నారు.
వచ్చే రెండేళ్లలో ఈ ప్రాంతమంతా ఒక మెడికల్ హబ్‌గా మారుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో త్వరలో నర్సింగ్ కాలేజీ, పీజీ కాలేజీ కూడా ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు వచ్చిన తర్వాత వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తున్నదని చెప్పారు. కొత్తగా ఇక్కడి కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మీ పిల్లలను మా పిల్లలుగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కే.విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ ధన్‌రాజ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, అప్పాల గణేశ్ చక్రవర్తి, కళాశాల ప్రిన్సిపాల్ జేవీడీ.ప్రసాద్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాది భైంసా. నాన్న నర్సింగ్ సింగ్ ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నరు. నా చిన్నతనంలో మా అమ్మ సావిత్ర బీడీలు చుట్టగా వచ్చిన ఆదాయంతో నన్నూ, తమ్ముడిని చదివించేది. మేం చిన్నగున్నప్పుడు మా నాన్నకు ఉద్యోగం లేక ప్రైవేటు పనులు చేసేవారు. విద్యుత్‌శాఖలో నెలకు రూ.700 జీతంతో టెంపరరీ ఆపరేటర్‌గా పని చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చాలా కష్టపడి చదువుకున్న. పదో తరగతి వరకు భైంసాలోని వాసవి పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో పూర్తి చేసిన. నీట్లో ఆలిండియా 1,97,418 ర్యాంకు వచ్చింది. మన జిల్లాలోనే నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు రావడంతో సంతోషంగా జాయిన్ అయి.. ఇంటి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే మెడిసిన్ చేస్తనని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. సీఎం సారుకు నేను, నాకుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం..
-ఠాకూర్ వైష్ణవి, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, భైంసా
సీఎం కేసీఆర్ సారు మా కుటుంబానికి దేవుడి కంటే ఎక్కువ. నా ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయడమే కాకుండా, నా కూతురికి ఈ రోజు ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే సీఎం కేసీఆరే కారణం. నేను 2003లో భైంసా సబ్ స్టేషన్లో నెలకు రూ.700 జీతంతో ఆపరేటర్‌గా చేరిన. తెలంగాణ వచ్చిన తర్వాత నా జీతం నెలకు రూ.12వేలు అయ్యింది. 2018లో సీఎం కేసీఆర్ మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు నాకు నెలకు రూ. 30 వేలకు పైగా జీతం వస్తున్నది. నా కూతురు వైష్ణవికి నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కోట్లు ఖర్చు చేస్తే గానీ ఈ రోజుల్లో డాక్టర్ చదువులు పూర్తయ్యే పరిస్థితి లేదు. అలాంటిది నయా పైసా ఖర్చు లేకుండా ఇంటికి దగ్గరలోనే మా కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసే అదృష్టం దక్కింది.
-నర్సింగ్ సింగ్, పేరెంట్, భైంసా
మేము హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో ఉంటాం. నాన్న మహేశ్వర్ ప్రైవేట్ పనులు చేస్తారు. అమ్మ రామలక్ష్మి గృహిణి. నా చదువంతా మా ఇంటికి సమీపంలోని విద్యాసంస్థల్లోనే సాగింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఆలిండియా 1,58,095 ర్యాంకు వచ్చింది. గతేడాదిగా నీట్ ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యాను. రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను. నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేయకుంటే ఈ సారి కూడా సీటు వచ్చేది కాదు. సీఎం కేసీఆర్ వల్లే డాక్టర్ అయ్యే అదృష్టం దక్కింది.