వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉండండి..
సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగాల ప్రకటన చేశారు..
అధిక టైంను ప్రిపరేషన్‌కు వినియోగించుకుంటే మేలు
సరైన విధంగా టెక్నాలజీని వాడుకుంటే ప్రయోజనం
ఇలాంటి అవకాశాలు రావంటున్న వ్యక్తిత్వ నిపుణులు
నౌకరు కొడితే జీవితంలో స్థిరపడే అవకాశం
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్న నిపుణులు
ఆదిలాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనవసరంగా సెల్‌ఫోన్ అధికంగా వినియోగిస్తున్నారా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా సమయం గడుపుతున్నారా? మనకు సంబంధం లేని పోస్టులకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడంలో బిజీగా ఉన్నారా? అయితే మీరు ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగ వేటలో ఉంటే ఇవన్నీ ఆపేయండి! సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా భారీసంఖ్యలో కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్స్ ఇవ్వడానికి కసరత్తు కూడా జరుగుతున్నది. అయితే మీకు ఇదే మంచి అవకాశం. సోషల్ మీడియాను పక్కన పెట్టి.. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లండి. టెక్నాలజీని సరైన విధంగా వాడుకోండి. సామాజిక మాధ్యమాలకు వినియోగించే సమయాన్ని ప్రిపరేషన్‌పై పెట్టండి. మీకు ఉద్యోగం రావడం ఖాయం. ఆలోచించండి.. నిర్ణయం తీసుకోండి..
ప్రస్తుతం ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ కనిపిస్తున్నది. గతంలో కేవలం మాట్లాడ డం కోసం చిన్నచిన్న ఫోన్లను వినియోగించేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం.. 4జీ, 5జీ వంటి నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రావడంతో కంపెనీలు కూడా వివిధ రకాల యాప్‌లు, పలు ఫీచర్లతో కూడిన మొబైల్స్‌ను తయారు చేస్తున్నాయి. రూ.5వేల నుంచి రూ.50 వేల ధర వరకు అండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కరోనా ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాయి. దీంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువతీయువకులు ఫోన్లు కొనుగోలు చేశారు. దీంతో ఫోన్ల వాడకం పెరిగింది. ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభమైన ఫోన్లు వాడకం తగ్గడం లేదు. గుడ్ మార్నింగ్ మొదలుకుని గుడ్‌నైట్ వరకు స్నేహితులు, బంధువులతో చాటింగ్ చేస్తున్నారు. రాత్రిళ్లు కూడా ఫోన్లను పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నారు. ఫోన్ల అధిక వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణుల చూసిస్తున్నా యువత పెడచెవిన పెడుతున్నారు. రోజు 4 నుంచి 6 గంటల వరకు ఫోన్‌కే సమయం కేటాయిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగిస్తున్నారు. పలు పోస్టులను లైక్, షేర్ చేస్తున్నారు.
సెల్‌ఫోనే ప్రపంచం..
విద్యార్థులు, యువతీయువకులు సెల్‌ఫోన్‌నే ప్రపంచంగా బతుకుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు పక్కనే ఉన్నా వారితో మాట్లాడకుండా సోషల్ మీడియాపై దృష్టి సారిస్తున్నారు. వారికి సంబంధం లేని అంశాలను చూస్తూ పెడదోవ పడుతున్నారు. అధిక సమయం కేటాయిస్తూ ఇంటి పనులు చేయకపోవడంతోపాటు సమయానికి భోజనం కూడా చేయడం లేదు. తల్లిదండ్రులు ఏమైనా అంటే వారిపైకే కోపానికి వస్తున్నారు. వివి ధ రకాల గేమ్‌లు ఆడుతూ సహనాన్ని కోల్పోయి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గొడవకు దిగుతున్నారు. గతంలో వీడియో గేమ్‌లు ఆడిన పలువురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. యువత సెల్ఫోన్ల వాడకం చూసి తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. చాలా కుటుంబాల్లో ఇదో సమస్యగా మారింది.
ఫోన్ పక్కన పెడితే ఉద్యోగం గ్యారంటీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,919 కొలువులు భర్తీ కానున్నాయి. జోనల్ విధానం కారణంగా స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలు రాసి విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. విద్యార్థులు చదువుకునేందుకు స్టడీ మెటీరియల్, అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచింది. రోజూ సెల్‌ఫోన్ కోసం గంటల సమయం కేటాయిస్తున్న యువకులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడంతో పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సర్కారు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వెలువరించిన నేపథ్యంలో విద్యార్థులు సెల్ఫోన్లు పక్కన పెట్టాలి. చదువడానికి సమయం కేటాయించి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్ష రాశాకే చేతిలో సెల్..
నా పేరు చట్ల దివ్యరాణి. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన. నా చదువంతా సర్కారు బళ్లనే సాగింది. సెల్ఫోన్లు ఇతర వ్యాపకాలన్నీ పక్కనపెట్టి మంచిగ చదివి ఉద్యోగం సాధించాలని ఆయన చెప్పిన్రు. ఆయన మాటలు నిరుద్యోగుల్లో నూతనోత్సాహం నింపినయ్. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్కారే చెప్పడం సూపర్. ప్రస్తుతం ఆదిలాబాద్ ఆకాశవాణి వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తిస్తున్న. ప్రిపరేషన్ కోసం కొన్నాళ్లు సెలవు పెడుత. ఇక సెల్‌ఫోన్ పక్కన పెట్టి, పుస్తకంతో కుస్తీ మొదలెడత. ఈసారి టీచర్ ఉద్యోగం సాధిస్తాననే ఆత్మవిశ్వాసం ఉన్నది. ఉద్యోగావకశాలు కల్పించడమే కాకుండా, అర్హులను కుటుంబసభ్యుల్లా సన్నద్ధం చేస్తున్న మంత్రి కేటీఆర్ సారుకు కృతజ్ఞతలు.
యువత పెడదారి పడుతున్నరు..
ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు యువత సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సాధానాలను సక్రమంగా వినియోగిచేస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం సెల్‌ఫోన్ వాడకం యువతను పెడదారి పట్టిస్తున్నది. అధికం వాడకం వల్ల విద్యార్థుల జీవితాలు హరింపజేసే ప్రమాదం కూడా ఉంది. కొంతకాలం సెల్ఫోన్లు పక్కనపెట్టి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం నాకు వస్తుందనే నమ్మకంతో పుస్తకాలు చదవాలి. ప్రభుత్వం కోచింగ్ సెంటర్లలో వివిధ ఉద్యోగాల స్టడీ మెటీరియల్, యూపీఎస్సీ మొదలుకొని అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో చదివితే ఉద్యోగం వస్తుంది.
ఫోన్ పక్కన పెడితే సరి..
యువకుల్లో సెల్‌ఫోన్ వాడకం బాగా పెరిగింది. అవసరం ఉన్నా లేకున్నా విద్యార్థులు, యువకులు ఫోన్లు చూస్తూ విలువైన సమయం వృథా చేస్తున్నరు. వారి భవిష్యత్తుపై ఫోన్ల ప్రభావం పడుతుంది. ఓపిక, సహనం కోల్పోతూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నరు. ఫోన్ వినియోగం వ్యసనంలా మారింది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడం యువతకు అందివచ్చిన అవకాశం. దీన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలతో చదివితే విజయం తథ్యం. ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణను వినియోగించుకొని కష్టపడి చదవాలి.
– ఓం ప్రకాశ్, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, రిమ్స్, ఆదిలాబాద్
సరైన మార్గంలో వినియోగించాలి
యువత సరైన మార్గంలో డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది. విజ్ఞానవంతులు కావడానికి టెక్నాలజీ వాడకం తెలుసుకోవాలి. ప్రస్తుతం యువత సెల్ఫోన్లను తమకు ఉపయోగపడే విధంగా వాడుకోవడం లేదు. సెల్ఫోన్లలో అనవసరమైన వాటిని చూడడంతో వారి విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనవసరంగా ఫోన్లో చాటింగ్‌కే సమయం వెచ్చిస్తున్నారు. అధిక వాడకం వల్ల అనారోగ్యం పాలవడంతో పాటు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఫోన్ల వాడకం వల్ల కలిగే నష్టాలను తగ్గించుకొని పుస్తకాలు బాగా చదివితే ఉద్యోగాలు సంపాదించవచ్చు.
– టీ రోషిరెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆదిలాబాద్
కేటీఆర్ సార్ దిశానిర్దేశం బాగుంది..
సీఎం కేసీఆర్ సార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం ఓ వరమనుకుంటున్న. ఉద్యోగాలు సాధించేందుకు యువతకు మంత్రి కేటీఆర్ సారు దిశానిర్దేశం చేయడం బాగుంది. ఆయన చెప్పిన విషయాలతో మాలో మరింత ఉత్సాహం వచ్చింది. నేను హార్టికల్చర్ ఎమ్మెస్సీ పూర్తిచేసిన. ప్రస్తుతం ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న. సెలవు పెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లాలనుకుంటున్న. యువత కొన్ని రోజులు సెల్‌ఫోన్ పక్కన పెట్టి.. చదువు మీద దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ సార్ మంచి మాట చెప్పిన్రు. కోచింగ్ మొదలయ్యాక నేను కూడా ఫోన్ పక్కకు పెడత. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంట. రైతు కుటుంబానికి చెందిన నేను ఉద్యానవనశాఖలో ఉద్యోగం కొట్టాలనుకుంటున్న. లక్ష్యసాధన వైపు యువతను నడిపిస్తున్న కేటీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
–మర్ల నవీన్‌యాదవ్, కరంజి(టీ) ,భీంపూర్ మండలం