అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించారు. ఏప్రిల్లో కూడా వడగండ్లు కర్షకులను మళ్లీ కోలుకోకుండా చేశాయి. కోసిన వరి, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. రైతన్నల రోదనలు విన్న కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాసటగా నిలిచారు. తడిసిన ధాన్యాన్ని సైతం సర్కారే కొంటుందని ప్రకటించి రైతుబాంధవుడిగా మారారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్త్తూ రైతన్నకు అండగా ఉంటున్న సీఎం.. తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామనడం ఆనందంగా ఉందని అన్నదాతలు పేర్కొంటున్నారు. మనసున్న మారాజు అని జేజేలు పలుకుతున్నారు.
– మంచిర్యాల, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సాహసోపేత నిర్ణయం
నా పేరు బయ్య రాజయ్య. నాకు టీకానపల్లిలో ఐదెకరాల ఎవుసం ఉంది. ఈ యాసంగిలో మొత్తం వరేసిన. మొన్ననే కోత కోయించిన. వడ్లను మా దగ్గరిలోని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన. వాన పడి వడ్లన్నీ తడిసినయ్. ఆరబెట్టిన. మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం వాన పాలైందని బాధపడ్డ. ఇంతలోనే సీఎం కేసీఆర్ సారు తడిసిన వడ్లను సర్కారు కొంటుందని చెప్పారు. అప్పుడు కేసీఆర్ దేవుడిలా కనిపించాడు. గిప్పటి వరకు ఏ సర్కారోళ్లు కూడా తడిసిన వడ్లను కొనలే.
రైతు బాంధవుడికి జేజేలు..
మంచిర్యాల, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. మార్చిలో దెబ్బతిన్న పంటలకు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించారు. ఇక గత నెలలో కురిసిన వర్షాలకు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని చూసి రోదిస్తున్న రైతన్నకు మరోసారి బాసటగా నిలుస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం రాష్ట్ర ప్ర భుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. సాగుకు పెట్టుబడి సాయం ఇచ్చి, నష్టపోయిన పంటకు పరిహారం అందజేసి, చివరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొంటున్న రైతుబాంధవుడు సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు. కష్టకాలంలో భరోసానిచ్చిన సర్కారుకు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
జిల్లాల వారీగా సాగు అంచనా..
నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో 1,00,846 ఎకరాల్లో వరి సాగు కాగా..1.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు కోసం 210 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 35 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 5,554 ఎకరాల్లో వరి సాగయ్యింది. 1,38,750 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా దహెగాంలో కేంద్రా న్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,230 హెక్టార్లలో వరి సాగైంది. 1,231 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో 94,200 ఎకరాల్లో వరి సాగు అయ్యింది. 2,35,500 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
ఏప్రిల్లోనూ అకాల వర్షాలు..
గత నెలలోనూ అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. నిర్మల్లో మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 423 ఎకరాల్లో పంట నష్టం జరుగగా, 467 మంది రైతులకు రూ.10 వేల పరిహారా న్ని చెల్లించనున్నారు. ఏప్రిల్లో అకాల వర్షాల కారణం గా 504 ఎకరాల్లో నష్టం జరుగగా, 496 ఎకరాల్లో మామిడి, 8 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 628 మందికి, మంచిర్యాల జిల్లాలో 312 మందికి రూ.10వేల నష్టపరిహారం రానున్నది. ఇక గత నెల కురిసిన వర్షాలకు మంచిర్యాలలో 3,899 ఎకరా లు, ఆదిలాబాద్ జిల్లాలో 6వేల ఎకరాల్లో మక్క, జొన్న పంటలు దెబ్బతినగా, వరి కొంత మేరకు దెబ్బతింది. ఆసిఫాబాద్ జిల్లాలో మూడు వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదని రైతులు అంటున్నారు.