కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతకాలంగా అటవీ శాఖకు-రైతుల మధ్య భూ వివాదం రాజుకుంటుంది. 20 రోజుల క్రితం రెబ్బెన మండలం తుంగెడలో ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య ఘర్షణ జరుగగా, తాజాగా.. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం దానాపూర్‌లో భూముల సర్వే కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. అటవీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక చేసేదేమీ లేక అటవీ అధికారులు వెనుదిరుగాల్సి వచ్చింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు సర్వేల పేరుతో లాక్కునేందుకు యత్నిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
దానాపూర్ గ్రామ సరిహద్దులోని దాదాపు 150 ఎకరాల్లో 62 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. తరతరాలుగా ఈ భూములు రైతుల ఆధీనంలోనే ఉండగా, అటవీ శాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం దాదాపు 10 ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగతా భూమిని కూడా రైతులనుంచి స్వాధీనం చేసుకునేందుకు సర్వే పేరుతో శుక్రవారం దానాపూర్ గ్రామానికి ఆసిఫాబాద్ డివిజనల్ అటవీ అధికారి అప్పలకొండ.. తన సిబ్బందితో కలిసి రాగా, రైతులు, గ్రామస్తులు వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
తాము సాగుచేసుకుంటున్న భూముల్లో సర్వేలు చేయడానికి వీలు లేదని, గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించడంతో ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి అప్పల కొండ తన సిబ్బందితో కలిసి వెనుదిరుగారు. ఒక్కొక్కరికీ రెండు, మూడు ఎకరాలకంటే ఎక్కువ లేదని, దీనిని కూడా అటవీ అధికారులు తీసుకుంటే తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. పేదరైతులపై అటవీ అధికారుల వేధింపులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దానాపూర్ రైతులు సాగుచేసుకుంటున్న 150 ఎకరాలు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. దానాపూర్ గ్రామం కూడా కొంత భాగం అటవీ భూమిలోనే ఉంది. భూముల సర్వే కోసం వెళ్తే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏమాత్రం సహకరించలేదు. నాలుగేళ్ల క్రితం 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. రైతుల ఆధీనంలో ఉన్న మిగతా భూమిని కూడా సర్వే చేసి స్వాధీనం చేసుకుంటాం. గతంలో రైతులు కూడా సహకరిస్తామని చెప్పారు.
– అప్పల కొండ, ఆసిఫాబాద్ అటవీ డివిజనల్ అధికారి
మా గ్రామ సమీపంలోని భూములను 75 ఏండ్ల సంది సాగు చేసుకుంటున్నం. 150 ఎకరాలను 62 మంది రైతులం దున్నుకుంటున్నం. నాలుగైదేళ్లుగా అటవీ అధికారులు మమ్ముల వేధిస్తున్నరు. ఇవి అటవీ భూములంటున్నరు. సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నరు. 75 ఏళ్ల నుంచి లేని అటవీ భూములు ఇప్పుడు ఎలా వచ్చాయి. మాకు జీవనాధారమైన ఈ భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోము. ఇకనైనా అధికారుల వేధింపులు మానుకోవాలి.
– లక్ష్మణ్, గ్రామ పెద్ద, రైతు