తాండూర్ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ (CITU ) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గురువారం తాండూర్ తహసీల్ కార్యాలయం నుంచి ఐబీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా ( Dharna ) నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జ్యోత్స్న కు వినతిపత్రం అందజేశారు.
సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, పాల్గొని విజయవంతం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా, రైతు, వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించి వేయడంతో పాటు కార్మిక సంఘాలను సైతం అణచివేసే విధంగా ఉన్నాయన్నారు. సమ్మెకు మద్దతుగా ఆటో యూనియన్ అధ్యక్షుడు హబీబ్ పాషా ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు ఐబీ చౌరాస్తాలో వంటవార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.